హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కాలేజీలో మెస్ ఇంచార్జి వేధిస్తున్నాడంటూ షీ టీమ్స్ కి ఫిర్యాదు చేశారు అమ్మాయిలు. పీజీ చదువుతున్న విద్యార్థినులు, తాము ఉంటున్న ఉస్మానియా యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్‌లో మెస్ ఇంచార్జీ వినోద్ తమను వేధిస్తున్నాడంటూ షీటీమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత విద్యార్థినులు తమ ఆవేదనను ఆడియో రూపంలో వెల్లడించారు. మెస్ ఇంచార్జీ వినోద్ ప్రవర్తన వల్ల హాస్టల్‌లో ఉండాలంటే భయంగా ఉందని, విద్యార్థినుల భద్రతే ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొన్నారు అమ్మాయిలు.
వినోద్ వల్ల అనేక మంది విద్యార్థినులు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.ఈ విషయమై ఇప్పటికే హాస్టల్ వార్డెన్, కళాశాల ప్రిన్సిపాల్‌లకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రహస్యంగా ఆన్‌లైన్ ద్వారా షీటీమ్ పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు.
తమ పేర్లు బయటకు వస్తే కెరీర్‌కు, భవిష్యత్తుకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టి, మెస్ ఇంచార్జీ వినోద్‌పై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధిత విద్యార్థినులు షీటీమ్ పోలీసులను కోరుతున్నారు.
