- ప్రేమ పేరుతో నమ్మించి లైంగిక దాడి
- బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడు అరెస్ట్
జూబ్లీహిల్స్, వెలుగు: ప్రేమ పేరుతో మైనర్ బాలికను నమ్మించి, లైంగికంగా వేధించడమే కాకుండా.. ఆమె ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి రూ. 2.48 లక్షలు వసూలు చేసిన నిందితుడిని బాధితురాలి ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం..
జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన బాధితురాలు 10వ తరగతి చదువుతున్న సమయంలో జితేందర్ రెడ్డి అలియాస్ జితిన్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమెకు పరిచయమయ్యాడు. ఆ పరిచయాన్ని ప్రేమగా మార్చుకుని, బాలికను నమ్మించాడు. ఆమెను జూబ్లీహిల్స్ డ్రైవ్ఇన్ ఏరియాలకు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. వారిద్దరి ఫొటోలను తీసి, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తూ రిలేషన్ కొనసాగించాలని ఒత్తిడి చేశాడు.
2024 మే 25న బాధితురాలిని మియాపూర్‌లోని ఓయో హోటల్‌కు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కూడా పలుమార్లు బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకుంటూ, ఫొటోలు లీక్ చేస్తానంటూ బెదిరించి బాధితురాలి నుంచి సుమారు రూ. 2.48 లక్షలు వసూలు చేశాడు.
అరాచకానికి స్నేహితుల సపోర్ట్
ఈ కేసులో జితిన్ స్నేహితులు అర్జున్ కొడూరి, రాజీవ్ కొడూరి, చిరుదీప్ వర్మ, మిట్టు యాదవ్ అలియాస్ రాధూ బాయ్ కలిసి బాధితురాలిని బెదిరించి, జితిన్‌కు సపోర్ట్‌గా నిలిచారు. ఒక పార్టీ సమయంలో మిట్టు యాదవ్ బాధితురాలిని అనుచితంగా తాకేందుకు కూడా ప్రయత్నించాడు.
అంతేకాకుండా “ది టీమ్ ఇన్ఫినిటీ గ్రూప్” అనే ఇన్స్టాగ్రామ్ గ్రూప్ ద్వారా బాధితురాలి వ్యక్తిగత ఫొటోలు, విషయాలను ప్రచారం చేసి ఆమె పరువు తీశారు. ఈ గ్రూప్‌ను మిట్టు అలియాస్ రాధూ బాయ్, మిథీష్ దగం కలిసి నిర్వహిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
రిచ్ కిడ్స్ కేసులోనూ నిందితుడే..
జితిన్ ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ ద్వారా ‘రిచ్ కిడ్స్’ను ట్రాప్ చేస్తున్న సంచలన కేసులోనూ నిందితుడిగా ఉంటూ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు కొంతకాలంగా గాలిస్తుండగా, విశ్వసనీయ సమాచారం అందడంతో గురువారం జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి సమీపంలో అదుపులోకి తీసుకున్నారు.
అతడి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు చూపిన ప్రదేశాల్లో పంచనామా నిర్వహించగా, మియాపూర్ ఓయో హోటల్లో జూన్ 1, 2024న బాధితురాలితో కలిసి జితిన్ చెక్-ఇన్ అయినట్లు రికార్డులు లభించాయి. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
