కారులో గంజాయి పెట్టి పోలీసులకు పట్టించిన ప్రియురాలు

కారులో గంజాయి పెట్టి  పోలీసులకు పట్టించిన ప్రియురాలు
  • మాజీ ప్రియుడిని కేసులో ఇరికించేందుకు యువతి కుట్ర 
  • పోలీసుల విచారణలో బయటపడ్డ నిజం
  • యువతి సహా ఐదుగురు అరెస్టు.. హైదరాబాద్​లో ఘటన 

హైదరాబాద్‌, వెలుగు: మాజీ ప్రియుడిపై కోపం పెంచుకున్న ఓ యువతి.. అతణ్ని గంజాయి కేసులో ఇరికించేందుకు కుట్ర పన్నింది. మాజీ ప్రియుడి కారులో గంజాయి పెట్టి, పోలీసులకు సమాచారమిచ్చి అతణ్ని పట్టించింది. అయితే పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. దీంతో యువతి సహా ఆమెకు సహకరించిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన హైదరాబాద్​లో జరిగింది. సరూర్‌‌నగర్​లోని కోదండరామ్‌నగర్‌కు చెందిన కషగోని శ్రవణ్‌ కుమార్‌‌ (30) ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. 

అతను గతంలో అమీర్‌‌‌‌పేట్‌‌లోని యాక్సిస్‌‌ బ్యాంక్‌‌లో ఉద్యోగం చేస్తున్నప్పుడు అధోక్షజ అలియాస్ రింకీతో పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారింది. అయితే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తి, నాలుగు నెలల్లోనే విడిపోయారు. అప్పటి నుంచి శ్రవణ్‌‌పై రింకీ కక్ష పెంచుకుంది. శ్రవణ్ పై కేసు పెట్టించి, జైలుకు పంపించాలని ప్లాన్ చేసింది.  

పబ్​కు వెళ్దామని చెప్పి రప్పించి.. 

మహేందర్ యాదవ్‌‌ అనే వ్యక్తి శ్రవణ్‌‌, రింకీలకు కామన్ ఫ్రెండ్. దీంతో మహేందర్ యాదవ్‌‌ తో శ్రవణ్‌‌కు రింకీ సోమవారం వాట్సాప్‌‌ కాల్ చేయించింది. ఇద్దరి మధ్య తలెత్తిన సమస్యలను పరిష్కరించుకునేందుకు జూబ్లీహిల్స్‌‌లోని అమ్నేషియా పబ్‌‌కి రావాలని చెప్పించింది. అప్పటికే రింకీ తన ఫ్రెండ్స్‌‌తో మంగళ్‌‌హాట్‌‌లో రూ.4వేలకు 40 గ్రాముల గంజాయి కొనుగోలు చేసింది. దాన్ని 8 గ్రాముల చొప్పున ఐదు ప్యాకెట్లు తయారు చేసింది. అయితే మహేందర్ యాదవ్ చెప్పిన మేరకు శ్రవణ్ జూబ్లీహిల్స్ వెళ్లాడు.  సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రోడ్‌‌ నంబర్ 10లోని మహేందర్ ఇంటికి వెళ్లి.. అక్కడ మహేందర్, అతని ఫ్రెండ్‌‌ దీక్షిత్ రెడ్డిని కలుసుకున్నాడు. ఆ తర్వాత మహేందర్‌‌‌‌, దీక్షిత్‌‌ రెడ్డి బైక్‌‌పై రాగా.. శ్రవణ్‌‌ తన కారులో కృష్ణకాంత్ పార్కుకు బయలుదేరాడు.  

పక్కాగా ప్లాన్ వేసి.. పోలీసులకు ఫోన్ చేసి 

కృష్ణకాంత్‌‌ పార్క్‌‌ వద్ద దీక్షిత్‌‌ రెడ్డి, అతని ఫ్రెండ్స్ ప్రణీత్‌‌ గోపీ, సూర్యతేజ... శ్రవణ్ కారులో ఎక్కారు. అక్కడి నుంచి రింకీ, మహేందర్‌‌‌‌ బైక్‌‌పై రాగా.. మిగతా వాళ్లు కారులో అమ్నేషియా పబ్‌‌కు బయలుదేరారు. అయితే పబ్‌‌ సమీపంలోకి రాగానే దీక్షిత్‌‌ రెడ్డి, ప్రణీత్‌‌ గోపీ, సూర్యతేజ కారు నుంచి దిగిపోయారు. కారు వెనకాలే వచ్చిన మహేందర్‌‌‌‌, రింకీ కూడా శ్రవణ్‌‌ వద్దకు వెళ్లలేదు. పబ్‌‌లోకి కూడా పోలేదు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం అందరూ అక్కడి నుంచి విడిపోయారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్‌‌ పోలీసులకు రింకీ ఫోన్ చేసింది. అమ్నేషియా పబ్ లోని పార్కింగ్‌‌ ప్లేసులో ఉన్న కారులో గంజాయి ఉందని.. కారు నంబర్‌‌‌‌తో సహా సమాచారం ఇచ్చింది. దీంతో  పోలీసులు అక్కడికి చేరుకుని శ్రవణ్ కారును తనిఖీ చేయగా, వెనుక సీట్‌‌లో గంజాయి ప్యాకెట్స్ దొరికాయి. కారు, గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని శ్రవణ్‌‌ను స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో శ్రవణ్ ను విచారించిన పోలీసులు.. ఇది చేసిందంతా రింకీనే అని గుర్తించారు. పథకం ప్రకారమే శ్రవణ్‌‌ను గంజాయి కేసులో ఇరికించేందుకు ప్రయత్నించినట్లు తెలుసుకున్నారు. దీంతో రింకీ సహా ఆమెకు సహకరించిన మహేందర్‌‌‌‌, దీక్షిత్‌‌ రెడ్డి, ప్రణీత్‌‌ గోపీ, సూర్యతేజను అరెస్ట్ చేశారు.