బిహార్‌‌‌‌ లో Rs. 20 వేలకే అమ్మాయిలు దొర్కుతరు.. ఉత్తరాఖండ్ మహిళా మంత్రి భర్త సాహూ వివాదాస్పద వ్యాఖ్యలు

బిహార్‌‌‌‌ లో  Rs. 20 వేలకే అమ్మాయిలు దొర్కుతరు.. ఉత్తరాఖండ్ మహిళా మంత్రి భర్త సాహూ వివాదాస్పద వ్యాఖ్యలు
  • లేటు వయసులో లగ్గం చేసుకోవాలన్నా దిగులు అక్కర్లేదు 
  • నోటీసులు ఇస్తామని  బిహార్ స్టేట్ విమెన్ కమిషన్ వెల్లడి

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ మినిస్టర్ రేఖా ఆర్య భర్త గిరిధారి లాల్‌‌ సాహూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పెండ్లి చేసుకోవాలనుకుంటే రూ.20 వేలు, రూ.25 వేలకే బిహార్‌‌‌‌లో అమ్మాయిలు అందుబాటులో ఉన్నారంటూ ఆయన కామెంట్ చేశారు. 

సాహూ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘మీరు లేటు వయసులో పెండ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా? కానీ పిల్ల దొరక్క ఇబ్బంది పడుతున్నారా? మీరేం ఆందోళన చెందకండి.. పిల్లను మేం తీస్కొస్తం. రూ.20 వేలు, రూ.25 వేలకే బిహార్‌‌‌‌లో అమ్మాయిలు అందుబాటులో ఉన్నారు. మీరు నాతో రండి.. నేను మీకు లగ్గం చేస్తాను” అని అన్నారు. 

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సాహూపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన క్షమాపణలు చెప్పారు. ‘‘కొంతమంది నా మాటలను వక్రీకరించారు. అది నా ఫ్రెండ్ మ్యారేజ్‌‌కు సంబంధించిన డిస్కషన్ మాత్రమే. నా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు కోరుతున్నా” అని వీడియో విడుదల చేశారు. 

రాజకీయ దుమారం.. 

సాహూ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. అధికార బీజేపీపై ప్రతిపక్ష కాంగ్రెస్ మండిపడింది. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా రేఖా ఆర్య పని చేస్తుండగా.. ఆమె భర్త ఇలాంటి కామెంట్లు చేయడమేంటని ఫైర్ అయింది. ‘‘ఇది మన దేశ మహిళలను అవమానించడమే. సాహూ వ్యాఖ్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నం. దీనికి బీజేపీ క్షమాపణలు చెప్పాల్సిందే” అని కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ గణేశ్ గొడియాల్ డిమాండ్ చేశారు. 

‘‘మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి భర్త ఇలా మాట్లాడడం సిగ్గుచేటు. ఇది దేశ మహిళల గౌరవాన్ని దెబ్బతీయడమే. ఇలాంటి ఆలోచన ఉన్న వ్యక్తుల వల్ల హ్యూమన్ ట్రాఫికింగ్, చైల్డ్ మ్యారేజ్ లాంటివి పెరిగిపోతాయి” అని మహిళా కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ జ్యోతి రౌటేలా మండిపడ్డారు.  అయితే ఈ వివాదానికి బీజేపీ దూరంగా ఉన్నది. కాగా, సాహూకు నోటీసులు ఇస్తామని బిహార్ స్టేట్  విమెన్ కమిషన్ చైర్‌‌‌‌పర్సన్ అప్సర తెలిపారు.