
రామచంద్రాపురం(పటాన్చెరు), వెలుగు: పటాన్చెరు పరిధిలోని గీతం డీమ్డ్ వర్సిటీ పూర్వ విద్యార్థిని శివాలి జోహ్రి శ్రీవాస్తవ మరో రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించి, దేశంలో అత్యధిక గిన్నిస్ రికార్డులు కలిగి ఉన్న వ్యక్తిగా నిలిచింది. శివాలి తల్లిదండ్రులు కవితా జోహ్రి, శ్రీవాస్తవతో కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద ఓరాగామి ప్రదర్శన చేసి సరికొత్త రికార్డులను సాధించింది.
చేతితో తయారు చేసిన ఓరాగామి బొమ్మలు, వివిధ రకాల ఆకారాలను ప్రదర్శించి శివాలి ఇప్పటికే 19 గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించగా, తాజాగా అతిపెద్ద ప్రదర్శన ఇచ్చి మరో రెండు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. దీంతో దేశంలో అత్యధిక గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించిన వ్యక్తిగా శివాలి నిలిచింది. వాటితో పాటు 15 అసిస్ట్ వరల్డ్ రికార్డులు, నాలుగు యూనిక్ వరల్డ్ రికార్డులను నెలకొల్పి కళల పట్ల తనకున్న మక్కువను నిరూపించుకుంది. అనంతరం శివాలి జోహ్రి శ్రీవాస్తవను వీసీ ప్రొఫెసర్ డీఎస్ రావు తదితరులు అభినందించారు.