
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద(ఏఐఐఏ)ను మంజూరు చేయాలని కేంద్రానికి హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ విజ్ఞప్తి చేశారు. 2030 నాటికి దేశంలో 10 ఆల్ ఇండియా ఆయుర్వేద ఇన్‌స్టిట్యూట్లను నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
అందులో ఒకటి రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర ఆయుష్, ఆరోగ్యశాఖ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ కు మంత్రి దామోదర్ లేఖ రాశారు. అందుకు అవసరమైన భూమి, ఇతర వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణలోని అడవుల్లో అద్భుతమైన ఆయుర్వేద సంపద ఉన్నదని.. ఔషధ గుణాలున్న మూలికలు, మొక్కల జాతులు ఉన్నాయని తెలిపారు.
ఈ మేరకు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ, ఆయుష్ డైరెక్టర్ శ్రీకాంత్ బాబు శనివారం హైదరాబాద్ కు వచ్చిన కేంద్ర మంత్రి ప్రతాప్ రావు జాదవ్ ను కలిసి లేఖను అందజేశారు.