Cricket World Cup 2023: ఈ 40 ఏళ్లలో ఒకే ఒక్కడు: కపిల్ దేవ్ ను గుర్తు చేసిన మ్యాక్స్ వెల్

Cricket World Cup 2023: ఈ 40 ఏళ్లలో ఒకే ఒక్కడు: కపిల్ దేవ్ ను గుర్తు చేసిన మ్యాక్స్ వెల్

వరల్డ్ కప్ 2023 లో నిన్న(నవంబర్ 6) ఒక పెద్ద అద్భుతమే చోటు చేసుకుంది. ముంబై వేదికగా ఆస్ట్రేలియా- ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆసీస్ ఓడిపోయే మ్యాచ్ లో అనూహ్యంగా గెలిచింది. ఆ జట్టు విధ్వంసకర వీరుడు గ్లెన్ మ్యాక్స్ వెల్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడుతూ ఏకంగా డబుల్ సెంచరీ బాదేశాడు. తమ జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించి సెమీస్ కు చేర్చాడు. ఆఫ్ఘనిస్తాన్ విధించిన 292 పరుగుల టార్గెట్ లో మ్యాక్ వెల్ ఒక్కడే 201 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కెప్టెన్ కమ్మిన్స్ తో 8 వ వికెట్ కు 202 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి వరల్డ్ కప్ చరిత్రలోనే గ్రేటెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. 

మ్యాక్సీ ఆడిన ఈ ఇన్నింగ్స్ భారత దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ ఇన్నింగ్స్ ను గుర్తు చేసింది. 1975 లో టీమిండియా, జింబాబ్వే పై 17 పరుగులకే 5 వికెట్లు.. 78 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో భారత్ స్కోర్ ను 260 పరుగులకు చేర్చాడు. ఈ మ్యాచ్ లో భారత్ ఓటమి ఖాయమన్న దశలో కపిల్ దేవ్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడి ఒక్కడే 175 పరుగులు చేసి భారత్ కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. సెమీస్ కు వెళ్లాలంటే కీలకంగా మారిన ఈ మ్యాచ్ లో కపిల్ ఆడిన ఈ ఇన్నింగ్స్ నిన్నటివరకు వరల్డ్ కప్ చరిత్రలోనే ఆల్ టైం బెస్ట్ ఇన్నింగ్స్ గా అభివర్ణిస్తారు. 

ఆ తర్వాత వరల్డ్ కప్ లో ఇప్పటివరకు ఇలాంటి ఇన్నింగ్స్ చూడలేదు. అయితే నిన్న ( నవంబర్ 7) ఆసీస్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య   జరిగిన మ్యాచ్ లో ఛేజింగ్ లో 40 ఏళ్ళ తర్వాత మ్యాక్ వెల్ ఇదే తరహా ఇన్నింగ్స్ ఆడటం విశేషం. 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న దశలో మ్యాక్ వెల్ తుఫాన్ ఇన్నింగ్స్ కారణంగానే ఈ మ్యాచ్ లో ఆసీస్ అనూహ్య విజయాన్ని అందుకుంది. 128 బంతుల్లో, 21 ఫోర్లు, 10 సిక్సులతో 201 పరుగులు చేసి వన్డే క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడేశాడు. 

ఈ డబుల్ సెంచరీతో వన్డేల్లో 6 నెంబర్ లేదా ఆ తర్వాత స్థానాల్లో బ్యాటింగ్ చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కపిల్ దేవ్ రికార్డ్ బ్రేక్ చేసాడు. అంతేకాదు ఆస్ట్రేలియా తరపున డబుల్ సెంచరీ చేసిన మొదటి ప్లేయర్ గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. మ్యాక్స్ వెల్ ఆడిన ఈ ఇన్నింగ్స్ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. సచిన్, సెహ్వాగ్ లాంటి దిగ్గజాలు మ్యాక్సీ ఇన్నింగ్స్ ను కొనియాడుతూ ట్వీట్ చేశారు. మొత్తానికి 40 ఏళ్ళ తర్వాత వరల్డ్ కప్ లో మ్యాక్స్ వెల్ అసాధారణ ఇన్నింగ్స్ తో మన దిగ్గజం కపిల్ దేవ్ ను గుర్తు చేసాడు.