ODI World Cup 2023: మ్యాక్స్‌వెల్ వీర ఉతుకుడు: వరల్డ్ కప్ చరిత్రలోనే బెస్ట్ ఇన్నింగ్స్

ODI World Cup 2023: మ్యాక్స్‌వెల్ వీర ఉతుకుడు: వరల్డ్ కప్ చరిత్రలోనే బెస్ట్ ఇన్నింగ్స్

వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మ్యాక్స్ వెల్ శివాలెత్తాడు. ముంబై వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లను చితక్కొడుతూ చుక్కలు చూపించాడు. ఓడిపోయే మ్యాచ్ ను ఒంటి చేత్తో గెలిపించి వరల్డ్ కప్ చరిత్రలోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. 128 బంతుల్లో 201 పరుగులు చేసిన మ్యాక్సీ ఇన్నింగ్స్ లో 21 ఫోర్లు, 10 సిక్సులు ఉన్నాయి. జట్టు స్కోర్ లో దాదాపు 70 శాతం పరుగులు చేసిన ఈ విధ్వంసకర వీరుడు ఆసీస్ కు మర్చిపోలేని విజయాన్ని అందించి సెమీస్ కు చేర్చాడు.    

ఈ వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ పై విరుచుకుపడిన మ్యాక్సీ.. ఆఫ్ఘనిస్తాన్ పై అంతకు మించిన ఆటతో ఒక పెద్ద విధ్వంసమే సృష్టించాడు. కంగారూల జట్టు ఒకదశలో 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. వార్నర్(18), హెడ్(0), మార్ష్ (24), లబుషేన్(14),మార్కస్ స్టోయినిస్(6) పెవిలియన్ కు క్యూ కట్టారు. ఆఫ్ఘనిస్తాన్ విజయం ఇక నల్లేరు మీద నడకే అనుకున్నారు. అయితే అసలు ప్రళయం అప్పుడే వస్తుందని ఆఫ్గనిస్తాన్ జట్టు గ్రహించలేకపోయింది. చేతిలోకి వచ్చిన క్యాచ్ ను విడిచిపెట్టి భారీ మూల్యం చెల్లించుకున్నారు. 

కమ్మిన్స్ తో కలిసి అజేయంగా 202 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. గాయం వేధిస్తున్న జట్టు విజయం కోసం పరితపించారు. ఇప్పటివరకు జరిగిన వరల్డ్ కప్ చరిత్రలోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడి సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే ఛేజింగ్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా, డబల్ సెంచరీ చేసిన ఆటగాడిగా తన పేరు మీద రికార్డ్ లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్ కు ముందు గోల్ఫ్ ఆడుతూ గాయపడిన మ్యాక్సీ ఈ మ్యాచ్ లో గాయాన్ని లెక్క చేయకుండా పోరాడిన తీరు క్రికెట్ లో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుంది.