రష్యా దాడితో చిక్కుల్లో ప్రపంచ దేశాలు

రష్యా దాడితో చిక్కుల్లో ప్రపంచ దేశాలు

ఉక్రెయిన్ పై రష్యా సృష్టిస్తోన్న  బీభత్సం అంతా ఇంతా కాదు. చిన్న పిల్లల దగ్గర్నుంచి... రేపో, మాపో చనిపోయే వృద్ధుల వరకూ అన్ని తరాల వారినీ గడగడలాడించిన రష్యా సైనిక విన్యాసాల గురించి ఎంత చెప్పినా తక్కువే. రష్యా చేసిన దండయాత్ర కారణంగా.. ఉక్రెయిన్ ఎన్నో రకాలుగా నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే తాజాగా ఉక్రెయినే కాదు.. రష్యా చేసిన ఈ పని వల్ల  ప్రపంచం మొత్తం చిక్కుల్లో పడనున్నట్టు తెలుస్తోంది. ఈ దాడి నేపథ్యంలో రానున్న కాలంలో ప్రపంచం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని, వ్యవసాయం, పంటల నూర్పిడి, కోతలు, నిల్వలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (యునైటెడ్‌ నేషన్స్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌) ఆందోళన వ్యక్తం చేసింది.  ప్రత్యేకంగా.. వచ్చే ఏడాది వ్యవసాయం, పంటల కోత, నిల్వ చేయడంవంటివి అత్యంత క్లిష్టంగా మారబోతున్నాయని హెచ్చరించింది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుందన్న  ఐక్యరాజ్యసమితి.. వాటి ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండబోవని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో పేద దేశాలు ఆహార ధాన్యాలను కొనుగోలు చేయలేని స్థితికి వస్తాయని..., దీంతో ఆయా దేశాల ప్రజలు ఆకలితో అలమటించే దుస్థితి ఏర్పడబోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. 

ఇక 2022--23లో ఎరువుల కొరత కూడా ఎదురు కాబోతోందని చెప్పుకొచ్చింది. యుద్ధం ప్రభావం వల్ల పంటల దిగుబడి దాదాపు 10 శాతం తగ్గుతుందన్న ఐక్యరాజ్యసమితి.. గతేడాది ఉత్పత్తి చేసిన పంటలన్నీ దేశంలోనే నిలిచిపోయాయని, ఇప్పటికే 2 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు వివిధ నౌకాశ్రయాల్లో పేరుకుపోయాయని వెల్లడించింది. వాటిని సకాలంలో రైతులు అమ్ముకోలేకపోతే పెట్టుబడికి తగిన డబ్బు వారికి అందదని, ఫలితంగా సాగు విస్తీర్ణం తగ్గుతుందని తెలిపింది. ఉక్రెయిన్‌ పోర్టుల్లో నిలిచిపోయిన ఆహార ధాన్యాల ఎగుమతులు ఎంత తొందరగా మొదలైతే సంక్షోభం తీవ్రత అంత తగ్గుతుందని ఐక్యరాజ్యసమితి చెప్పింది.