- బ్రెంట్ క్రూడాయిల్ 76.70 డాలర్లకు
న్యూఢిల్లీ: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం ముగింపు దశకు చేరడంతో గ్లోబల్‌గా ఆయిల్ ధరలు మూడు నెలల కనిష్టానికి దిగొచ్చాయి. శాంతి ఒప్పందానికి సంబంధించిన ఎంఓయూపై సంతకాలు పూర్తి కావడంతో బ్రెంట్ క్రూడ్ ధర గురువారం మూడున్నర శాతం పడి 76.70 డాలర్లకు చేరింది. గత నాలుగు రోజుల్లో 17 శాతం తగ్గింది.
అమెరికా క్రూడాయిల్ డబ్ల్యూటీఐ ధర 4 శాతం తగ్గి 74 డాలర్లకు తగ్గింది. ఇరాన్ ఆయిల్ కూడా మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉండడంతో ధరలు మరింత పడే అవకాశం ఉంది. కానీ, యుద్ధం వల్ల మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఆయిల్, గ్యాస్ ఫెసిలిటీస్ దెబ్బతిన్నాయి. ఇవి తిరిగి సాధారణ స్థాయికి తిరిగి రావడానికి కొంత టైమ్ పడుతుంది. అప్పటివరకు ఆయిల్ ధరలు 70–-75 డాలర్ల రేంజ్‌లోనే కదిలే అవకాశం ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్ యుద్ధం మొదలవ్వగా, అప్పటి నుంచి క్రూడ్ ధర పెరుగుతూ వచ్చింది.
ఒకానొక దశలో బ్యారెల్‌కు 126 డాలర్లు దాటింది. మరోవైపు క్రూడాయిల్ ధరలు తగ్గితే ఇండియాకు మేలు జరుగుతుంది. ప్రస్తుతం ఇండియా బాస్కెట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 78 డాలర్లు ఉంది. ధరలు దిగొస్తే మనం చేసే డాలర్ల చెల్లింపులు తగ్గుతాయి. దేశ కరెంట్ అకౌంట్ ఖాతాపై ఒత్తిడి తగ్గుతుంది. ఫారెక్స్ నిల్వలు వేగంగా ఖర్చయిపోవు. ధరలు ఇదే స్థాయిలో ఇంకొంత కాలం కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరలూ తగ్గొచ్చు.
