ఎయిర్​పోర్ట్​ మెట్రో టెండర్లకు నోటిఫికేషన్

ఎయిర్​పోర్ట్​ మెట్రో టెండర్లకు నోటిఫికేషన్
  •     కాంట్రాక్టు అంచనా రూ.5,648 కోట్లు 
  •     జులై 5న బిడ్డింగ్‌‌కు చివ‌‌రి తేదీ

హైదరాబాద్, వెలుగు:  ఎయిర్ పోర్ట్​ మెట్రో రైల్ నిర్మాణానికి గ్లోబల్ టెండర్లు ఆహ్వానిస్తూ మంగళవారం హైదరాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) నోటిఫికేషన్ జారీ చేసింది. కాంట్రాక్టు అంచనా రూ.5,648 కోట్లుగా నిర్ధారించింది. ఇంజినీరింగ్, ప్రొక్యూర్​మెంట్, కన్​స్ట్రక్షన్(ఈపీసీ) పద్ధతిలో కాంట్రాక్టర్ పనులు చేయాల్సి ఉంది. ఇంజినీరింగ్ పనులు, భూముల సేకరణ, నిర్మాణ పనులు కాంట్రాక్టరే చూసుకోవాలి. ఇందుకు అవసరమైనవన్నీ హెచ్ఏఎంఎల్ అందించనుంది. బుధవారం నుంచి బిడ్డింగ్ పత్రాలను జారీ చేయనుంది. జులై 5  బిడ్ సమర్పించేందుకు ఆఖరు తేదీగా నిర్ణయించింది. టెండర్లకి సంబంధించిన పత్రాలు తెలంగాణ ప్రభుత్వ ఈ -పోర్టల్ https://tender.telangana.gov.inలో అప్‌‌లోడ్ చేయనున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.  టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ మెట్రో రైల్​కి అవసరమైన ఎలివేటెడ్ వయాడక్ట్, భూగర్భ పనులు, స్టేషన్లు,  ట్రాక్ పనులు, ఎలక్ట్రికల్, మెకానికల్ పనులు, సరఫరా, రోలింగ్ స్టాక్ (రైలు బోగీలు), ఎలక్ట్రిక్ ట్రాక్షన్, విద్యుత్ సరఫరా, సిగ్నలింగ్, టెలీ కమ్యూనికేషన్స్, రైలు నియంత్రణ వ్యవస్థలు, ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ గేట్లు మొదలైనవి పూర్తిచేయాల్సి ఉంటుందన్నారు. రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు 31 కిలో మీటర్లలో నిర్మాణం జరగనుంది. 1.7  కిలో మీటర్ల లైన్ భూగర్భంలో నిర్మించనున్నారు. ఒక స్టేషన్ అండర్ గ్రౌండ్​లో రానుంది.  మూడేండ్లలో  పనులు  పూర్తి చేయాలని  లక్ష్యం పెట్టుకున్నారు.