
- జీమెయిల్లో ఒకేసారి డిలీట్
వాట్సాప్, యూట్యూబ్ వంటి యాప్‌లలానే జీమెయిల్ కూడా రెగ్యులర్‌గా వాడే యాప్. రోజూ ఎన్నో రకాల మెయిల్స్ వస్తుంటాయి. ప్రమోషన్స్, సోషల్ ఇలా రకరకాల మెయిల్స్‌తో ఇన్‌బాక్స్ నిండిపోతుంది. దీంతో కొన్నిసార్లు అవసరమైన మెయిల్‌ని వెతికి పట్టుకోవడం కూడా కష్టమవుతుంది. వెంటనే రిప్లయ్ ఇవ్వడం కుదరకపోవచ్చు. అంతేనా.. అవసరం లేని మెయిల్స్ డిలీట్ చేయాలంటే కొంత టైం కేటాయించాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఆ అవసరం లేదు అంటోంది గూగుల్ కంపెనీ. జీమెయిల్లో మెయిల్స్‌ని డిలీట్ చేయడానికి కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. అదేంటంటే.. ‘మేనేజ్ సబ్స్క్రిప్షన్స్’. ఈ ఫీచర్ ద్వారా ఇన్‌బాక్స్‌లోని మెయిల్స్‌ని ఈజీగా క్లియర్ చేయొచ్చు. ఇంతకుముందులా ప్రతి మెయిల్‌ని ఓపెన్ చేసి అన్సబ్స్ర్కైబ్ చేయాల్సిన పనిలేదు.
వాటిని వెతకాల్సిన అవసరం కూడా లేదు. సబ్స్క్రిప్షన్ మెయిల్స్ అన్నీ ఒకే క్లిక్‌తో ఎగిరిపోతాయి. అయితే అందులో అవసరమైనవి ఏవైనా ఉంటే వాటిని వదిలేసి మిగతా వాటిని మాత్రమే అన్సబ్స్ర్కైబ్ చేయొచ్చు. ఒకవేళ ఎప్పుడైనా చూడాలనుకుంటే సబ్స్క్రిప్షన్ కోసం ఒక క్లిక్ చేస్తే యాక్టివేట్ అవుతుంది. ‘మేనేజ్ సబ్స్క్రిప్షన్స్’ ఆప్షన్ మొబైల్, వెబ్ వెర్షన్స్‌లో అందుబాటులో ఉంది. దీన్ని వాడాలంటే ముందుగా జీమెయిల్ ఓపెన్ చేసి ఇన్‌బాక్స్‌కి వెళ్లి, ఎడమవైపున ప్రమోషన్స్, సోషల్, స్పామ్స్లో ఈ ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మెయిల్స్‌ని ఎంచుకుని క్లిక్ చేస్తే సరి.