ఆడు జీవితం.. ఓ అరుదైన చిత్రం 

ఆడు జీవితం.. ఓ అరుదైన చిత్రం 

పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ తెరకెక్కించిన చిత్రం ‘ది గోట్ లైఫ్‌‌’ (ఆడు జీవితం).  విజువల్ రొమాన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ విడుదలవుతోంది.  మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పిన విశేషాలు. 

 రియల్ ఇన్సిడెంట్స్‌‌తో ఈ  చిత్రాన్ని  తెరకెక్కించారు దర్శకుడు బ్లెస్సీ.  నైంటీస్‌‌లో  జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే వ్యక్తి జీవిత కథ ఇది.  నజీబ్ ఎడారిలో సాగించిన ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలను చూపించాం. 2018లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాం. ముందుగా రాజస్థాన్ ఎడారిలో షూటింగ్ చేయాలని అనుకున్నా.. అక్కడ అరబ్ దేశాల ఎడారుల వాతావరణం కనిపించలేదు. దాంతో జోర్డాన్ వెళ్లి చిత్రీకరణ జరిపాం. ఆ తర్వాత లాక్‌‌డౌన్ వచ్చింది.  తిరిగి ఏడాదిన్నర తర్వాత అల్జీరియా సహారా ఎడారిలో షూట్ పూర్తి చేశాం.

ఈ సినిమా కోసం నేను 31 కిలోల బరువు తగ్గాను. మేమొక గొప్ప సినిమా చేస్తున్నామనే నమ్మకంతో ఉండేవాళ్లం. ప్రేక్షకులకు గొప్ప ఎక్స్‌‌పీరియెన్స్‌‌ను ఇస్తుంది.  ఇందులో  నటిస్తున్నప్పుడు నాకు వచ్చిన కొన్ని మంచి ఆఫర్స్ వదులుకోవాల్సి వచ్చింది. ఇలాంటి అరుదైన సినిమాకు పనిచేస్తున్నప్పుడు మిగతా అవకాశాలు  వదులుకోవడం తప్పదు. తెలుగులో మైత్రీ మూవీ సంస్థ రిలీజ్ చేయడం సంతోషంగా  ఉంది.  మిగతా భాషల్లో డబ్బింగ్ చెప్పినట్లే తెలుగులోనూ నేనే డబ్బింగ్ చెప్పా. భవిష్యత్తులోనూ ఇలాంటి బలమైన కథా కథనాలు ఉన్న  చిత్రాల్లో నటించాలనుకుంటున్నా