దసరా పండుగ రోజున ‘గాడ్ ఫాదర్’ రాక

దసరా పండుగ రోజున ‘గాడ్ ఫాదర్’ రాక

మెగాస్టార్ చిరంజీవి న్యూ ఫిల్మ్ ‘గాడ్ ఫాదర్’ టీజర్ రిలీజైంది. ఆగస్టు 22న చిరు జన్మదినం. ఈ సందర్భంగా ఒకరోజు ముందే ఆదివారం సాయంత్రం టీజర్ ను విడుదల చేశారు. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘లూసిఫర్’ సినిమాకు ఇది రీమేక్. ‘20 ఏళ్లు ఎక్కడకు వెళ్లాడో ఎవరికీ తెలియదు.. తిరిగొచ్చిన ఆరేళ్లలో జనంలో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు’ అనే డైలాగ్ తో టీజర్ మొదలైంది. ‘ఇక్కడకు మాత్రం రావొద్దు’ అని నయన తార అనగా.. సూపర్ గా చిరు ఎంట్రీ ఇచ్చారు. తనదైన స్టైల్ లో గన్ తిప్పుతూ శత్రువులపై విరుచుకుపడుతాడు.

ఈ చిత్రంలో స్పెషల్ రోల్ లో నటిస్తున్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా టీజర్ లో కనిపించారు. సోదరుడిని మరిచిపోవద్దు... ఇప్పుడే వచ్చేస్తానంటూ సల్మాన్ హిందీలో చెప్పిన డైలాగ్ అదిరింది. ‘నేను చెప్పేదాకా ఆగు బ్రదర్’ అని చిరు చెప్పడం.. ఇద్దరు కలిసి జీపులో రావడం అభిమానులను అలరించింది. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా.. ఆర్ బీ చౌదరి, ఎన్ వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పకురాలుగా ఉన్నారు. ఇటీవలే విడుదల చేసిన ‘గాడ్ ఫాదర్’  ప్రీ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. విజయదశమి సందర్భంగా  అక్టోబరు 5న మూవీ రిలీజ్ అవుతుంది.