కరోనాతో ప్రజలు చనిపోవడం దేవుడికి మాత్రం ఇష్టమా?

కరోనాతో ప్రజలు చనిపోవడం దేవుడికి మాత్రం ఇష్టమా?
  • పొరుగు రాష్ట్రాలతో చర్చించి కావడ్ యాత్రపై నిర్ణయం
  • ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి వ్యాఖ్య

డెహ్రాడూన్: కావడ్ యాత్రను ఏకపక్షంగా రద్దు చేయలేమని, పొరుగు రాష్ట్రాలతోనూ చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి చెప్పారు. ఉత్తరాఖండ్‌లో ఏటా ఘనంగా జరిగే కావడ్ యాత్రలో హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొంటారని, కరోనా క్రైసిస్ నేపథ్యంలో వేరే రాష్ట్రాల వారిని అనుమతించాలా వద్దా అన్నది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. గతవారం కొత్తగా సీఎం బాధ్యతలు చేపట్టిన ఆయన ఆదివారం జాతీయ మీడియాతో మాట్లాడారు. కావడ్ యాత్రను ఇప్పటికే గత ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ రద్దు చేసినప్పటికీ దీనిపై మరోసారి రివ్యూ చేసిన నిర్ణయం తీసుకుంటామని ధామి చెప్పారు. ‘ఇది కేవలం ఒక్క ఉత్తరాఖండ్‌కు సంబంధించిన విషయం కాదు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు కావడులతో వచ్చి గంగోత్రి, గోముఖ్, హరిద్వార్‌‌లలో పవిత్ర గంగా జలాలను తీసుకెళ్లి తమ ప్రాంతాల్లో శివుడికి అభిషేకాలు చేస్తుంటారు. అందుకే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని తెలిపారు. ఇది లక్షలాది మంది భక్తుల నమ్మకానికి సంబంధించిన విషయమని, అయితే ప్రజల ప్రాణాలను రిస్క్‌లో పెట్టలేమని అన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడడమే తమ ఫస్ట్ ప్రయారిటీ అని, దేవుడు కూడా ఈ యాత్ర ద్వారా ప్రజలు కరోనాతో ప్రాణాలు కోల్పోవాలని కోరుకోడు కదా అని ఆయన అన్నారు.