పెరిగిన వేతనాలను మే1 నుంచి అమలు చేయాలి : బి. సూర్య శివాజీ

పెరిగిన వేతనాలను మే1 నుంచి అమలు చేయాలి : బి. సూర్య శివాజీ

ఆర్మూర్, వెలుగు:  బీడీ కార్మికులకు పెరిగిన వేతనాలను మే ఒకటి నుంచి అమలు చేయాలని  తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఇఫ్టూ) రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు  బి. భూమన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. సూర్య శివాజీ  కోరారు.  ఆదివారం ఆర్మూర్‌‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.  రాష్ట్రంలో  బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న బీడీ కార్మికులకు, ప్యాకర్లు, బట్టీవాలా, చెన్నివాలా, బీడీ చాటర్స్, ట్రై పిల్లర్, క్లర్క్స్  కేటగిరీలకు చెందిన  కార్మికులకు గత  వేతన ఒప్పందం 30 ఏప్రిల్​2024తో  ముగిసిందన్నారు.

  కొత్త వేతన ఒప్పందం కోసం ఇఫ్టూ యూనియన్ తరఫున కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్ నోటీసు ఇచ్చి శనివారం బీడీ కార్మిక సంఘాలకు బీడీ యాజమాన్య సంఘంతో హైదరాబాద్ లో చర్చలు జరిగాయని తెలిపారు.  చర్చల్లో బీడీ ప్యాకర్లకు నెలకు రూ.3,650/--,  నెలసరి  ఉద్యోగస్తులకు రూ.1700/-- చొప్పున వేతనాలు పెరిగాయని, బీడీలు చుట్టే కార్మికులకు వెయ్యి బీడీలకు  రూ.4-25 చొప్పున కూలీ రేట్ల పెంపుకు ఒప్పందం కుదిరిందని తెలిపారు. 

పెరిగిన వేతనాలు -2026 ఏప్రిల్ వరకు అమలులో ఉంటాయని వివరించారు. కార్మికుల ఐక్యత వల్లనే కూలీరేట్లు పెరిగాయని, బీడీ కార్మికులు ఐక్యంగా ఉండి తమ హక్కుల సాధన కోసం పోరాటాలు చేయాలని కోరారు . ఇఫ్టూ జిల్లా ప్రధాన కార్యదర్శి జేపీ గంగాధర్, సహాయ కార్యదర్శి సుప్రియ,  వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.