Weather alert : హైదరాబాద్ లో మళ్లీ సెగ.. పొడి వాతావరణంతో పెరగనున్న ఎండ

Weather alert : హైదరాబాద్ లో మళ్లీ సెగ.. పొడి వాతావరణంతో పెరగనున్న ఎండ

తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా అక్కడక్కడా పడుతున్న వర్షాలతో వాతావరణం చల్లబడింది. మొన్నటిదాకా మండే ఎండలతో అల్లాడిన జనాలకు ఈ వర్షాలు కాస్త ఉపశమనాన్ని ఇచ్చాయని చెప్పాలి. అయితే, తాజాగా ఐఎండీ ఇచ్చిన వెదర్ అప్డేట్ జనాల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఈ నెల 31వరకు తెలంగాణాలో పొడి వాతావరణం కొనసాగుతుందని, దీని కారణంగా మళ్లీ ఎండలు పెరగనున్నాయని తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలుచోట్ల ఉష్ణోగ్రతలు 46డిగ్రీలు దాటిన నేపథ్యంలో ఐఎండీ ఇచ్చిన తాజా అప్డేట్ భయాన్ని రెట్టింపు చేసేలా ఉంది.

ఇదిలా ఉండగా ఉత్తర తెలంగాణాలో ఎండలు మండిపోతోంటే, దక్షిణ తెలంగాణాలో రెమల్ తుఫాను ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి.  ప్రస్తుతం ఉత్తరాది జిల్లాల్లో టెంపరేచర్లు 47 డిగ్రీలకు చేరువవుతుండగా.. దక్షిణాదిన మాత్రం కంట్రోల్​లోనే ఉన్నాయి. జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో టెంపరేచర్లు 45 డిగ్రీలకుపైగా రికార్డవుతున్నాయి. దక్షిణాది జిల్లాల్లో 42 డిగ్రీల లోపలే నమోదవుతున్నాయి.

ఆదివారం జగిత్యాల జిల్లా జైనలో అత్యధికంగా 46.5 డిగ్రీల టెంపరేచర్ రికార్డయింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 45.8, పెద్దపల్లి జిల్లా కమాన్​పూర్​లో 45.7, ఆదిలాబాద్​ జిల్లా అర్లి(టి)లో 45.2, నిర్మల్ జిల్లా ముజ్గిలో 45, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్​లో 45 డిగ్రీలు నమోదైంది. కామారెడ్డి జిల్లా కొల్లూరులో 44.6, రాజన్న సిరిసిల్ల జిల్లా వట్టెమాలలో 44.4, మెదక్ జిల్లా రేగోడులో 44.4, కరీంనగర్ జిల్లా ఇందుర్తిలో 44.2, నిజామాబాద్ జిల్లా వాయిల్​పూర్​లో 44.1, ఖమ్మం జిల్లా ముదిగొండలో 44 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డయ్యాయి. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో 39 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదైతే.. మిగతా జిల్లాల్లో మాత్రం 43 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.