- పౌరులే లక్ష్యంగా పాక్ దాడులు చేస్తోందంటూ తాలిబాన్ ప్రభుత్వం ఫైర్
కాబూల్: పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా పాకిస్తాన్ వైమానిక దళం అఫ్గాన్‌పై దాడి చేసింది. పౌరుల ఇండ్లే లక్ష్యంగా శుక్రవారం పాక్ జరిపిన దాడుల్లో ఆరుగురు పౌరులు మృతి చెందారు. డజను మందికి పైగా గాయపడ్డారు. పౌరులే లక్ష్యంగా పాక్ ఎయిర్ స్ట్రైక్స్ చేస్తోందని అఫ్గాన్ తాలిబాన్ ప్రభుత్వం మండిపడింది.
దక్షిణ అఫ్గానిస్తాన్ కాందహార్‌లోని ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఉన్న ప్రైవేట్ ఎయిర్‌లైన్ కామ్ ఎయిర్ ఇంధన డిపోలను పాక్ మిస్సైల్స్ తాకాయని అఫ్గాన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ‘ఎక్స్’లో తెలిపారు. ఈ కంపెనీ పౌర విమానయాన సంస్థలకు, ఐక్యరాజ్య సమితి విమానాలకు ఇంధనాన్ని సరఫరా చేస్తుందని చెప్పారు. పాక్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఈ క్రమంలో అఫ్గాన్‌పై పాక్ చేసిన దాడులు విజయవంతమైనట్లు పాక్ ప్రభుత్వ టెలివిజన్ చానల్స్‌లో వార్తలొచ్చాయి. అఫ్గాన్‌లోని నాలుగు టెర్రరిస్ట్ స్థావరాలను, వారి మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని పాక్ దాడులు చేసిందని చెప్పింది.
పాకిస్తాన్‌లో పేలుడు.. ఏడుగురు పోలీసులు మృతి
పెషావర్: పాకిస్తాన్‌లో ఐఈడీ బాంబు పేలి ఏడుగురు పోలీసులు మృతి చెందారు. లక్కి మర్వాత్ జిల్లా షాదీ ఖేల్ బెట్టానీ ప్రాంతంలో ఓ పోలీసు వెహికల్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా రోడ్డు పక్కన ఉన్న ఐఈడీ బాంబును ఢీకొట్టడంతో భారీ పేలుడు జరిగింది. దీంతో పోలీసు వెహికల్ ధ్వంసం కాగా, అందులో ఉన్న ఒక ఎస్‌హెచ్‌వో, డ్రైవర్‌తో పాటు మరో నలుగురు పోలీసు అధికారులు అక్కడికక్కడే మరణించారు.
మరో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు కాగా, హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దాడికి పాల్పడిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ దాడిని ఖైబర్ ఫఖ్తుంక్వా సీఎం సోహైల్ ఆఫ్రిదీ ఖండించారు. టెర్రరిస్టులది పిరికిపంద చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలియజేశారు. ఘటనపై దర్యాప్తు చేసి, రిపోర్టు అందజేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
