గోదావరి పుష్కరాలకు రూ.134 కోట్లతో రోడ్లు..ఫైల్ రెడీ చేసిన ఆర్అండ్ బీ

గోదావరి పుష్కరాలకు రూ.134 కోట్లతో రోడ్లు..ఫైల్ రెడీ చేసిన ఆర్అండ్ బీ
  • త్వరలోనే టెండర్లు పిలవనున్న సర్కారు 

హైదరాబాద్, వెలుగు : గోదావరి పుష్కరాలను మహా కుంభమేళా తరహాలో నిర్వహించడంతో పాటు 'తెలంగాణ బ్రాండ్' సంస్కృతి ప్రతిబింబించేలా చూసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. వచ్చే ఏడాది జూన్, జులై నెలల్లో జరిగే పుష్కరాల ఏర్పాట్లను ప్రభుత్వం స్పీడప్​ చేసింది. ఇందులో భాగంగా రూ.134 కోట్లతో రోడ్ల నిర్మాణ పనులను చేపట్టనున్నారు. ఈ మేరకు రోడ్లు భవనాల శాఖ ఫైల్​సిద్దం చేసింది. త్వరలోనే సర్కారు టెండర్లు సైతం పిలవనున్నారు.

కీలకమైన తొమ్మిది క్షేత్రాలకు ప్రాధాన్యం

గోదావరి పుష్కరాల నిర్వహణలో భాగంగా మౌళిక వసతుల ఏర్పాట్లకు ప్రభుత్వం రూ. వెయ్యి కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. తర్వాత జులై 13 నుంచి 24 వరకు అంత్య పుష్కరాలు నిర్వహించనున్నారు. దీంతో గోదావరి నదీ తీరంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే 96 ప్రాంతాలను గుర్తించారు. 

వీటిలో భద్రాచలం, బాసర, కాళేశ్వరం, ధర్మపురి, చెన్నూర్ వంటి తొమ్మిది కీలకమైన క్షేత్రాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. మేడారం జాతర తరహాలోనే కోట్ల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారంతా పుష్కరఘాట్లకు వెళ్లడానికి వీలుగా రోడ్లను బాగు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ రూ.134 కోట్ల నిధులు కేటాయించింది. 

జిల్లాల వారీగా వివరాలు ప్రకటన

జిల్లాల వారీగా చేపట్టే పనుల వివరాలను ఆర్ అండ్ బీ శాఖ ప్రకటించింది. నిజామాబాద్​జిల్లా కందకుర్తి దగ్గర రూ. 13.4 కోట్లు, నిర్మల్​జిల్లా బాసరలో రూ.14 కోట్లు, పెద్దపల్లి జిల్లా మంథనిలో రూ.22 కోట్లు, ములుగు జిల్లా మంగపేటలో రూ.16.60 కోట్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో రూ.17.6 కోట్లు, భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద రూ.17.90 కోట్లు, కొడవటంచ లక్ష్మీనర్సింహ స్వామి దేవాలయం వద్ద రూ.32.30 కోట్లతో పనులు చేపట్టడానికి సర్కారు జీవో జారీ చేసింది. పనులకు సంబంధించిన ఎస్టిమేట్లను ఇంజినీర్లు తయారు చేస్తున్నారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు మొదలుపెడతామని ఆర్అండ్​బీ స్టేట్​రోడ్స్​విభాగం ఈఎన్సీ వెంకటేశ్వర్ రావు తెలిపారు.