గోదారి: ఎండలు ముదరకముందే ఎండిపోయింది

గోదారి: ఎండలు ముదరకముందే ఎండిపోయింది

రాష్ట్రానికి గోదావరి నదే వరప్రదాయిని. రాష్ట్రంలోని చాలా ప్రాంతాలకు సాగు, తాగునీరు అందేది, కరెంటు ఉత్పత్తికి అన్నింటికీ గోదావరే పెద్ద దిక్కు. రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదలై.. కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల మీదుగా ఆంధ్రప్రదేశ్ లోకి వెళుతుంది. గోదావరి వెంట ఉన్న అన్ని ప్రాంతాలు నది నీటి పైనే ఆధారపడి ఉన్నాయి. ఏటా ఎండాకాలం ముదిరాక గోదావరి నది ఎండిపోతున్నా.. ఈసారి మార్చి తొలివారంలోనే నీటి చుక్క కనబడకుండా పోవడం ఆందోళనకరంగా మారింది. బాసర, ధర్మపురి, కాళేశ్వరం, గోదావరిఖని, భద్రాచలం.. ఇలా అన్ని ప్రాంతాల్లోనూ ఎడారిని తలపిస్తోంది.

వానల్లేక..
గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వానలు లేకపోవడం, ఎగువన మహారాష్ట్ర కురిసిన వర్షపు నీరంతా అక్కడి ప్రాజెక్టుల్లోనే ఆగిపోవడంతో నదిలో ప్రవాహం కనిపించడం లేదు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్, జాల్నా, పర్బని, నాందేడ్ జిల్లాల్వర్షా లు కురిస్తే .. ఆ నీరు బాబ్లీ ప్రాజెక్టుకు, తర్వాత మన రాష్ట్రంలోని ఎస్సారెస్పీకి చేరుతుంది. ఈసారి ఆయా ప్రాంతాల్లో పెద్దగా వానలు పడలేదు. వచ్చిన కొద్దిపాటి నీటిని నదిపై అక్కడక్కడా కట్టిన బ్యారేజీల్లో నిల్వ చేసేశారు. దాంతో బాబ్లీ ప్రాజెక్టులోకి నీరు రాలేదు. దిగువన అవసరాల దృష్ట్యా ఏటా మార్చి 1న (వేసవిలో) బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని వదులుతారు. ఆ నీటిని బాసర, నిర్మల్ , నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తాగు, సాగు అవసరాలకు వినియోగిస్తారు. ఈసారి కూడా నీటి విడుదల కోసం బాబ్లీకి వెళ్లిన రాష్ట్ర అధికారులు.. అక్కడ చుక్క నీరు కూడా లేకపోవడంతో వెనుదిరిగి వచ్చారు. నీళ్లు రాక బాసర వద్ద గోదావరి ఎడారిని తలపిస్తోంది.

ఇక్కడా అదే పరిస్థితి
బాసర దిగువన గోదావరి నదికి మంజీరా, ప్రాణహిత ఉప నదుల నీరే కీలకం. సాధారణంగా ప్రాణహిత పరీవాహకంలో వర్షాలు ఎక్కువగా పడతాయి. గోదావరిలో ఆ ప్రవాహాలు ఉంటాయి. కానీ ఈసారి ప్రాణహితలోనూ నీళ్లు తగ్గిపోయాయి. మంజీరా పరీవాహక ప్రాంతాల్లోనూ వర్షాలు లేక గోదావరిలో నీరు చేరలేదు. దాంతో నది మొత్తం ఎండి పోయి కనిపిస్తోంది. ఒక్క ఎల్లంపల్లి ప్రాజెక్టులో మాత్రమే వర్ష కాలంలో నిల్వ చేసిన నీరు అందుబాటులో ఉంది. ఆ ప్రాజెక్టు దిగువన కూడా ఎక్కడా నీటి జాడల్లేవు. ఇటీవల మహాశివరాత్రి సందర్భంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కొంత నీటిని దిగువకు వదిలారు. దాంతో మంథని, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లా పరిధి వరకు చిన్న పాయగా ప్రవాహం కనిపిస్తోంది. మరో నాలుగు రోజులైతే ఆ నీళ్లు కూడా కనిపించని పరిస్థితి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం వద్ద కూడా గోదావరి పిల్ల కాల్వలా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద ఇన్ టేక్ వెల్ వద్ద మోటార్లు కూడా పైకి తేలాయి. దీంతో నీటి సరఫరాకు ఇబ్బం దులు ఎదురవుతున్నాయి.

రైతన్నల ఆశలు అడియాసలే
గోదావరి పరీవాహక ప్రాంతంలో రబీ పంటపై ఆశలు పెట్టుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎస్సారెస్సీ ఆయకట్టు కింద బాసర చుట్టుపక్కల ప్రాంతాల్లో వేల ఎకరాల్లో పంటలు సాగుచేశారు. బాబ్లీ ప్రాజెక్టు నుంచి విడుదల చేసే నీటిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ నీరందే పరిస్థితి లేదు. ఎస్సారెస్పీ దిగువన కూడా నది ఒడ్డు వెంట పంటలు సాగు చేసిన రైతులు కూడా నిరాశలో మునిగిపోయారు.