గోదావరికి పోటెత్తిన వరద..మంపులో వందలాది గ్రామాలు

గోదావరికి పోటెత్తిన వరద..మంపులో వందలాది గ్రామాలు

నెట్​వర్క్​, వెలుగు: వానలతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. గోదావరి ఉపనదులైన ప్రాణహిత, ఇంద్రావతి, మానేరు నుంచి వరద పోటెత్తుతోంది. దీంతో మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాలలో వందకు పైగా గ్రామాలు ముంపునకు గురయ్యాయి. నిజామాబాద్​ జిల్లాలోని శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుకు 2.76 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు పూరిస్థాయి కెపాసిటీ 90 టీఎంసీలు కాగా,  72.269 టీఎంసీలకు చేరిం ది. దీంతో ఆదివారం సాయంత్రం  9 గేట్లు ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. జూలై10లోపు గేట్లు ఎత్తడం ఎస్సారెస్పీ చరిత్రలో ఇదే మొదటిసారని ప్రాజెక్టు ఇంజినీర్లు ప్రకటించారు.  ప్రస్తుతం ఎగువ నుంచి 2,76,481క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నట్లు ఆఫీసర్లు వెల్లడించారు. గోదావరికి భారీ వరద కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి సమ్మక్క బ్యారేజీ వరకు గేట్లను తెరిచి పెట్టారు. 

 దిగువన అన్ని గేట్లు ఖుల్లా.. 

కడెం, ఎస్సారెస్పీ ప్రాజెక్టులతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి వరద పోటెత్తుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో అధికారులు శనివారం రాత్రి 20 గేట్లు ఓపెన్ చేశారు. తెల్లారేసరికి వరద ఉధృతి మరింత పెరగడంతో మరో ఏడు గేట్లు తెరిచారు. అన్ని గేట్లను రెండు మీటర్ల మేర పైకెత్తి 2,55,366 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఎల్లంపల్లి దిగువన ఉన్న సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల గేట్లను సైతం ఓపెన్ చేశారు. గోదావరి నిండుగా ప్రవహిస్తుండడంతో నదీ తీర ప్రాంతాల ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీరం వెంబడి పర్యవేక్షిస్తున్నారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద 12.450 మీటర్ల ఎత్తులో,  ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద 14.84 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తుండడంతో అధికారులు రెండు చోట్ల మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సుందిళ్ల(పార్వతి) బ్యారేజీ నుంచి 2.5 లక్షల క్యుసెక్కుల వరద వస్తుండగా, దానికి మానేరు, ఇతర వాగుల నుంచి 1.05 లక్షల క్యుసెక్కుల ఫ్లడ్​ తోడవడంతో అన్నారం(సరస్వతి) బ్యారేజీ మొత్తం 50 గేట్లను తెరిచి 3.55 లక్షల క్యుసెక్కుల నీటిని మేడిగడ్డకు విడుదల చేశారు. అటు ప్రాణహిత నది నుంచి 5 లక్షల క్యుసెక్కులకు పైగా వరద తోడుకావడంతో మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీకి 8.66 లక్షల క్యుసెక్కుల ఇన్​ఫ్లో చేరుతోంది. దీంతో మేడిగడ్డ బ్యారేజీ 75 గేట్లను తెరిచి మొత్తం నీటిని దిగువకు పంపిస్తున్నారు. ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలంలో గల సమ్మక్క(తుపాకుల గూడెం) బ్యారేజీ దగ్గరికి వచ్చే సరికి ఇంద్రావతి నది నుంచి వచ్చే వరద కూడా జత కలవడంతో మొత్తం వరద ప్రవాహం 9.53 లక్షల క్యుసెక్కులకు చేరింది. ఇక్కడ ఆఫీసర్లు మొత్తం 59 గేట్లను తెరిచి నీటిని పూర్తిగా కిందికి వదిలేస్తున్నారు. మరోవైపు దిగువన భద్రాచలం వద్ద  గోదావరి  నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు 39.70  అడుగులుండగా, ఇంద్రావతి, తాలిపేరు, కిన్నెరసాని నుంచి భారీగా వరద వస్తుండటంతో ఆదివారం ఏరాత్రయినా మొదటి ప్రమాదహెచ్చరిక జారీ చేస్తామని భద్రాద్రికొత్తగూడెం  కలెక్టర్​ అనుదీప్​ చెప్పారు. ఎస్పీ వినీత్​, ఇతర ఆఫీసర్లతో కలిసి భద్రాచలం వద్ద గోదావరిని పరిశీలించి, తహసీల్దార్లు అలర్టుగా ఉండాలని ఆదేశించారు. 

నీట మునిగిన గ్రామాలు.. 

గోదావరిలో వరద ప్రవాహం పెరగడంతో భూపాలపల్లి, ములుగు జిల్లాలలోని గోదావరి తీర ప్రాంతాల ప్రజలను ఆఫీసర్లు అప్రమత్తం చేశారు. మహాదేవ్‌‌పూర్‌‌, పలిమెల, ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వెంకటాపురం, వాజేడు మండలాలలో వందకు పైగా గోదావరి ముంపు గ్రామాలున్నాయి. దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదివారం రెవెన్యూ, ఐటీడీఏ, పోలీస్‌‌ శాఖ ఆఫీసర్లతో రివ్యూ చేసి పలు సూచనలు చేశారు. గోదావరిలో వరద పెరుగుతుండటంతో వెంటనే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి భోజనం, వసతి సౌకర్యాలు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
 కరీంనగర్​లోని లోయర్ మానేరు డ్యామ్ కు ఉదయం నుంచి సాయంత్రం ఇన్ ఫ్లో కొనసాగింది. మొత్తం 24 టీఎంసీలకు 9.565 టీఎంసీలకు చేరుకుంది.
  చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్​ 20 గేట్లు ఎత్తి  నీటిని దిగువకు వదులుతున్నారు. పాల్వంచలోని కిన్నెరసాని ప్రాజెక్టు నుంచి 21 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.