V6 News

Telangana Global Summit : ఫ్యూచర్ సిటీలో గోద్రేజ్ పెట్టుబడులు.. సీఎం రేవంత్తో సంస్థ ప్రతినిధుల భేటీ

Telangana Global Summit : ఫ్యూచర్ సిటీలో గోద్రేజ్ పెట్టుబడులు.. సీఎం రేవంత్తో సంస్థ ప్రతినిధుల భేటీ

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు విజయవంతంగా కొనసాగుతోంది. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. గోద్రేజ్ సంస్థ కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. 

సీఎం రేవంత్ రెడ్డితో  గోద్రేజ్ జెర్సీ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ పిరోజ్ షా గోద్రెజ్, గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి సమావేశమయ్యారు. హైదరాబాద్ లో తమ కంపెనీ విస్తరణపై సీఎంతో చర్చించారు. పాల ఉత్పత్తులు, FMCG, రియల్ ఎస్టేట్, ఆయిల్ ఫామ్ విభాగాల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపించారు. 

తెలంగాణ రైజింగ్–2047’ గ్లోబల్ సమిట్​లో తొలిరోజే (డిసెంబర్ 08) రాష్ట్రానికి దేశ, విదేశీ కంపెనీలు క్యూ కట్టాయి. భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ప్రభుత్వంతో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. ఫ్యూచర్​ సిటీ వేదికగా సోమవారం రెండు రోజుల గ్లోబల్​ సమిట్​ ప్రారంభమైంది. మొదటి రోజు సుమారు రూ. 2.43 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి. వివిధ కంపెనీలు  35 ఎంవోయూలపై సంతకాలు చేశాయి. సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో.. డీప్‌టెక్‌, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ వంటి రంగాల్లో పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో తమ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు అంగీకరించాయి.   

ప్రత్యేకంగా రెన్యూవబుల్​ ఎనర్జీ, బయోటెక్, సినిమా నిర్మాణం, మీడియా, విద్య, టెక్నాలజీ వంటి సెక్టార్లలో  ఆసక్తి చూపించాయి. ఈ పెట్టుబడులతో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు దక్కుతాయని ప్రభుత్వం తెలిపింది. ఇది ‘విజన్ –2047’ కోసం శుభ పరిణామమని పేర్కొంది.