- దుబాయ్ నుంచి స్మగ్లింగ్ చేస్తుండగా అరెస్ట్
- బంగారం విలువ రూ.1.06 కోట్లు
- నిందితుడిని అరెస్ట్ చేసిన డీఆర్ఐ అధికారులు
శంషాబాద్, వెలుగు: దుబాయ్ నుంచి షూలో అక్రమంగా బంగారం తీసుకొచ్చిన వ్యక్తిని శంషాబాద్ ఎయిర్పోర్టు అధికారుల సహకారంతో డీఆర్ఐ ఆఫీసర్లు అరెస్ట్ చేశారు. నడకలో తేడా ఉండటంతో అనుమానించిన అధికారులు.. అతన్ని తనిఖీ చేశారు. షూ నుంచి సుమారు కిలోన్నర బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈకే 528 నంబర్ విమానంలో ఓ వ్యక్తి దుబాయ్ నుంచి హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. నడకలో తేడా ఉండటంతో అతనిపై అధికారులకు అనుమానం వచ్చింది. అరైవల్ హాల్లోకి రాగానే వీపుకు తగిలించుకున్న బ్యాగ్తో సహా అతన్ని స్కాన్ చేశారు. వ్యక్తి ఎడమ కాలి షూలో బ్యాటరీ ఆకారంలో రెండు పసుపు రంగు పెద్ద మెటల్ బార్లు కనిపించాయి. అదే విధంగా బ్యాగ్లోనూ ఓ మెటల్ చైన్ ఉన్నట్లు స్కానింగ్లో తేలింది. అతని బ్యాగుతో పాటు షూను చెక్ చేయగా.. 1,390.850 గ్రాముల బంగారం దొరికింది. పట్టుబడ్డ గోల్డ్ విలువ రూ.1.06 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కస్టమ్స్ యాక్ట్ కింద నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని అధికారులు తెలిపారు.
