ఆస్కార్‌‌‌‌ బరిలో మరాఠీ చిత్రం గోంధల్‌‌

ఆస్కార్‌‌‌‌ బరిలో మరాఠీ చిత్రం గోంధల్‌‌

ఈ ఏడాది మన దేశం నుంచి ఆస్కార్‌‌కు అఫీషియ‌‌ల్ ఎంట్రీ కోసం ‘పెద్ది’ మొదలు ‘ధురంధర్‌‌‌‌’ వరకు పలు భారీ చిత్రాలు పోటీపడగా.. అందరినీ సర్‌‌‌‌ప్రైజ్ చేస్తూ ‘గోంధల్‌‌’ అనే ఓ చిన్న సినిమా ఎంపికైంది.  ఫిల్మ్ ఫెడ‌‌రేష‌‌న్ ఆఫ్ ఇండియా శుక్రవారం ఆ వివరాలను ప్రకటించింది.  సంతోష్‌‌ ధవాకర్‌‌‌‌ తెరకెక్కించిన ఈ మరాఠీ చిత్రంలో కిశోర్ కదమ్, ఇషితా దేశ్‌‌ముఖ్, యోగేష్ సోహోని కీల‌‌క పాత్రలు పోషించారు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్.  మ‌‌హారాష్ట్ర గ్రామీణ సంస్కృతి,  సంప్రదాయాలు, ఆచారాలకు క్రైమ్‌‌ ఎలిమెంట్స్‌‌ జోడించి ఓ ఎమోషనల్‌‌ డ్రామాగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.  ఇళయరాజా సంగీతం అందించారు.  గత ఏడాది జరిగిన ఇంట‌‌ర్నేష‌‌న‌‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌‌ల్ ఆఫ్ ఇండియాలో సిల్వర్‌‌‌‌ పీకాక్‌‌ అవార్డును గెలుచుకున్న ఈ సినిమా ఇప్పుడు 99వ ఆస్కార్‌‌‌‌ ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌‌‌‌ ఫిల్మ్‌‌ విభాగంలో  చోటు దక్కించుకుంది.  
 

పోటీలో 33 చిత్రాలు

ఆస్కార్ ఎంట్రీ కోసం మొత్తం 33 సినిమాలు రేసులో నిలవగా, వాటిలో అత్యధికంగా హిందీ నుంచి 14 సినిమాలు వచ్చాయి. తెలుగు,  గుజరాతీ,  మరాఠీ భాషల నుంచి 4 సినిమాలు, త‌‌మిళం నుంచి 3, మ‌‌ల‌‌యాళం, నాగ‌‌మీ భాష‌‌ల నుంచి ఒక్కో సినిమా పోటీ పడ్డాయి.  తెలుగు నుంచి పెద్ది, ఇరుముడి,  సింగ్‌‌ గీతం, ఇగ్వా చిత్రాలు.. హిందీ నుంచి ధురంధర్‌‌‌‌, ధురంధర్‌‌‌‌: ది రివెంజ్‌‌, 120 బహదూర్‌‌‌‌,  బోర్డర్‌‌‌‌ 2,  ఇక్కీస్‌‌, హనుమాన్‌‌ అంశ్‌‌ సహా పలు చిత్రాలు పోటీపడ్డాయి. వీటిలో ‘గోంధల్‌‌’ చిత్రాన్ని జ్యూరీ ఎంపిక చేసింది. భారతీయ సంస్కృతిని ఇందులో అద్భుతంగా ఆవిష్కరించారని,  సినిమాటోగ్రఫీ, సంగీతం చక్కగా కుదిరాయని జ్యూరీ సభ్యులు చెప్పారు.