కాంగ్రెస్​ ఇప్పుడు రాకుంటే.. ఇంకెప్పుడూ రాదు : గోనె ప్రకాశ్ రావు

కాంగ్రెస్​ ఇప్పుడు రాకుంటే..  ఇంకెప్పుడూ రాదు : గోనె ప్రకాశ్ రావు
  • కాంగ్రెస్​ ఇప్పుడు రాకుంటే..  ఇంకెప్పుడూ రాదు
  • మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు

న్యూఢిల్లీ, వెలుగు : రాష్ట్రంలో ఈ సారి కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే ఇకముందు ఆ పార్టీ కనుచూపు మేరలో కనపడదని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు అన్నారు. బలహీన వర్గాలకు సీఎం పదవి కేటాయించాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్​కు గురువారం లేఖ రాశారు. అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్​లో గోనె ప్రకాశ్ రావు మీడియాతో మాట్లాడారు. 

రాష్ట్రంలో ఇప్పటివరకు కేటాయించిన కాంగ్రెస్ సీట్లపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి టికెట్లు ఇచ్చారని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్​లో ప్యారాచూట్లకు స్థానం కల్పించారని విమర్శించారు. సీట్లు అమ్ముకున్నారని తాను అనడం లేదని,  సీట్ల వ్యవహారంలో గందరగోళం నెలకొందని అన్నారు. మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి బీఆర్​ఎస్​లో గెలవలేకపోయారని, వారు కాంగ్రెస్ నుంచి ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. బోథ్ లో కాంగ్రెస్​కు డిపాజిట్ కూడా రాదన్నారు.