- మరింత సరళంగా బీమా రూల్స్
- వేగంగా ఫిర్యాదుల పరిష్కారానికి కృషి
- ఐఆర్‌డీఏ ప్రకటన
న్యూఢిల్లీ: హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారుల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. బీమా పాలసీ రేట్ల పెరుగుదల, క్లెయిమ్ ప్రాసెసింగ్ ఆలస్యం కావడం, ఆసుపత్రులు ఎక్కువ బిల్స్వసూలు చేయడం, రూల్స్ అర్థం కాకపోవడం వంటి ముఖ్యమైన సమస్యల పరిష్కారానికి నడుం బిగించింది. ఆరోగ్య బీమాను మరింత సరళంగా పారదర్శకంగా మార్చే లక్ష్యంతో ఒక కొత్త సబ్–-కమిటీని ఏర్పాటు చేసింది. బీమా ప్రీమియం ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో బీమా కవరేజీ స్థాయి, క్లెయిమ్‌ల అనుభవం, ప్రొడక్ట్ డిజైన్, ఫిర్యాదుల పరిష్కారం వంటి కీలక అంశాలను ఈ కమిటీ లోతుగా పరిశీలిస్తుంది. పాలసీదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా నియంత్రణ విధానపరమైన మార్పులను సూచిస్తుంది. బీమాపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచే దిశగా ఐఆర్‌డీఏ అడుగులు వేస్తోంది.
మోసాలకు అడ్డుకట్ట
ఆసుపత్రి బిల్లుల్లో పారదర్శకత లేకపోవడం వల్ల పాలసీదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇన్సూరెన్స్ ఉంటే టారిఫ్ రేట్లు పెంచుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఒకే వ్యాధికి వేర్వేరు ఆస్పత్రుల్లో వేర్వేరు రేట్లు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో కమిటీ బీమా సంస్థలు, ఆసుపత్రుల మధ్య ఉన్న సంబంధాలను పరిశీలిస్తుంది. ఆసుపత్రుల టారిఫ్‌ల నిర్ణయం, నెట్‌వర్క్ నిర్మాణ విధానాలు పాలసీదారుల ఖర్చులపై చూపే ప్రభావాన్ని విశ్లేషిస్తుంది. ఆరోగ్య బీమా రంగంలో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు కఠిన చర్యలను సూచిస్తుంది. క్లెయిమ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్‌ఛేంజ్ (ఎన్‌హెచ్‌సీఎక్స్) వాడకాన్ని మరింత పెంచడం, డిజిటల్ వ్యవస్థలను బలోపేతం చేయడంపై సమీక్ష నిర్వహిస్తుంది. డేటా అనలిటిక్స్ వినియోగం పైనా దృష్టి పెడుతుంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూపుల సూచనలను కూడా ఈ కమిటీ పరిగణనలోకి తీసుకుంటుంది. ప్రైవేట్ ఆరోగ్య బీమాను ప్రభుత్వ పథకాలతో అనుసంధానించే అవకాశాలను అధ్యయనం చేస్తుంది.
రికార్డు స్థాయిలో ప్రీమియం వృద్ధి
దేశంలో ఆరోగ్య బీమా రంగం రికార్డు స్థాయిలో వృద్ధి చెందుతోంది. ఏంజిల్ వన్ డేటా ప్రకారం 2026 జనవరిలో ఆరోగ్య బీమా ప్రీమియంలు ఏకంగా 27.17 శాతం వృద్ధి చెంది రూ.5,414.54 కోట్లకు చేరుకున్నాయి. ఇందులో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రీమియంలు 20.4 శాతం పెరిగి రూ.2,187.98 కోట్లుగా నమోదు కాగా, స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థల ప్రీమియంలు 32.3 శాతం దూసుకెళ్లి రూ.3,226.56 కోట్లకు చేరాయి. రిటైల్ హెల్త్ పాలసీలపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) తగ్గడం వల్ల వచ్చి మార్పులు, ప్రభుత్వ పథకాల వాటా పెరగడం వల్లే ఈ వృద్ధి సాధ్యమైంది. ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐలు) కూడా బీమా పాలసీలు తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని కంపెనీలు చెబుతున్నాయి.
మార్కెట్ సైజు రూ.3.17 లక్షల కోట్లకు..
స్కై క్వెస్ట్ అధ్యయనం ప్రకారం భారత ఆరోగ్య బీమా మార్కెట్ 2024లో ఉన్న 15.99 బిలియన్ డాలర్ల నుంచి 2032 నాటికి ఏకంగా 38.2 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.3.17 లక్షల కోట్లు) చేరుకుంటుందని అంచనా. ఈ రంగం సగటున వార్షికంగా 11.5 శాతం వృద్ధిని నమోదు చేయనుంది. పెరుగుతున్న వైద్య ఖర్చులు, ప్రజల్లో ఆరోగ్య భద్రతపై అవగాహన పెరగడం వల్లే మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం కంపెనీలు అందించే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ విభాగం బీమా మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ, వ్యక్తిగత, రిటైల్ పాలసీల వాటా కూడా క్రమంగా పెరుగుతోంది. ప్రధానంగా ఆసుపత్రిలో చేరితే అయ్యే ఖర్చులను కవర్ చేసే బేసిక్ పాలసీలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కొన్ని రకాల అనారోగ్యాలకు ఇచ్చే సప్లిమెంటరీ కవర్‌లకు కూడా ఆదరణ లభిస్తోంది.
