కాంట్రాక్ట్‌‌‌‌ ఉద్యోగుల వైద్యసేవలపై సింగరేణి నజర్‌‌‌‌

కాంట్రాక్ట్‌‌‌‌ ఉద్యోగుల వైద్యసేవలపై సింగరేణి నజర్‌‌‌‌
  • రెండు చోట్ల ఈఎస్‌‌‌‌ఐ ఆసుప్రతుల ఏర్పాటు
  • జైపూర్‌‌‌‌ ఎస్టీపీపీలో ఒకటి, కొత్తగూడెంలో మరొకటి

కోల్‌‌‌‌బెల్ట్‌‌‌‌, వెలుగు: సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్​ కార్మికుల ఆరోగ్య రక్షణపై యాజమాన్యం దృష్టి సారించింది. సింగరేణి హాస్పిటల్స్‌‌‌‌లో కార్మికులకు వైద్యం అందిస్తుండగా వారి కుటుంబాలకు కూడా మెరుగైన సేవలు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా  మంచిర్యాల జిల్లా జైపూర్‌‌‌‌ సింగరేణి థర్మల్‌‌‌‌ పవర్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌ వద్ద ఒకటి, కొత్తగూడెం ఏరియాలో మరో ఈఎస్‌‌‌‌ఐ హాస్పిటల్‌‌‌‌ ఏర్పాటు చేయనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. మరోవైపు అన్ని ఏరియాల్లో హాస్పిటల్స్‌‌‌‌లో సేవలు అందించాలని సింగరేణి సీఎండీ ఎన్​.బలరాంనాయక్‌‌‌‌ ఇటీవల ఈఎస్‌‌‌‌ఐ డైరెక్టర్‌‌‌‌ జనరల్‌‌‌‌ కమల్‌‌‌‌ కిశోర్‌‌‌‌ సోన్‌‌‌‌ను కోరారు.

కాంట్రాక్ట్‌‌‌‌ కార్మికులకు వైద్య పరీక్షలు
సింగరేణిలో వివిధ విభాగాలు, డిపార్ట్‌‌‌‌మెంట్లపరంగా శ్రీరాంపూర్‌‌‌‌ ఏరియాలో 1,497, మందమర్రిలో 1,105, బెల్లంపల్లిలో 935, కొత్తగూడెంలో 3,141, ఇల్లెందులో 400, మణుగూరులో 2,071, రామగుండం-1లో 947, రామగుండం-2లో 931, రామగుండం-3లో 2,189, అడ్రియాలో 762, భూపాలపల్లిలో 1,670, సెక్యూరిటీ విభాగంలో 1,318, సివిల్‌‌‌‌లో 5,246, అటవీశాఖలో 409, డ్రైవర్లు 315, ఇతరులు 2,245 మంది కాంట్రాక్ట్, ఔట్‌‌‌‌సోర్సింగ్‌‌‌‌ కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి సింగరేణి హాస్పిటల్స్‌‌‌‌లో ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ అందిస్తున్నారు. వీరికి మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు యాజమాన్యం దృష్టి సారించింది. దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా కాంట్రాక్ట్‌‌‌‌ కార్మికులకు యాజమాన్యం వైద్య పరీక్షలు చేయించింది. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మెడికల్‌‌‌‌ స్క్రీనింగ్‌‌‌‌ క్యాంప్‌‌‌‌లు చేపట్టింది. బీపీని చెక్‌‌‌‌ చేయడంతో పాటు షుగర్‌‌‌‌, గుండెపరమైన సమస్యలు తెలుసుకునేందుకు 2డీ ఎకో వంటి పరీక్షలు నిర్వహించింది.

రెండు చోట్ల ఈఎస్‌‌‌‌ఐ హాస్పిటల్స్‌‌‌‌
కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్‌‌‌‌ కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో మొదటిసారిగా సింగరేణిలో ఈఎస్‌‌‌‌ఐ హాస్పిటల్స్‌‌‌‌ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. జైపూర్‌‌‌‌ ఎస్టీపీసీ ప్లాంట్‌‌‌‌తో పాటు కొత్తగూడెంలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఎస్టీపీపీలో వివిధ ప్రాంతాలకు చెందిన 1,500 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరి కుటుంబసభ్యులు ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ కోసం జైపూర్‌‌‌‌ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంచిర్యాల, గోదావరిఖనిలోని ప్రైవేట్‌‌‌‌, ప్రభుత్వ హాస్పిటల్స్‌‌‌‌కు వెళ్లాల్సి వస్తోంది. అత్యవసర సమయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎస్టీపీపీ ప్లాంట్‌‌‌‌లో ఈఎస్‌‌‌‌ఐ హాస్పిటల్‌‌‌‌ ఏర్పాటు చేస్తే తమ కుటుంబాలకు మెరుగైన ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ అందుతుందని కార్మికులు అంటున్నారు. అలాగే అన్ని ఏరియాల్లో ఈఎస్‌‌‌‌ఐ హాస్పిటల్స్‌‌‌‌ను ఏర్పాటు చేయాలని ఈఎస్‌‌‌‌ఐ డైరెక్టర్‌‌‌‌ను కోరిన సీఎండీ బలరాంనాయక్‌‌‌‌, ఇందుకు అవసరమైన సదుపాయాలు, క్వార్టర్ల కేటాయింపును సింగరేణే చూస్తుందని హామీ ఇచ్చారు. తొలుత ఈఎస్‌‌‌‌ఐ డిస్పెన్సరీలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని, అవసరం మేరకు హాస్పిటల్స్‌‌‌‌గా మార్చే అంశాన్ని పరిశీలిస్తామని డైరెక్టర్​ జనరల్‌‌‌‌ హామీ ఇచ్చారు.

కాంట్రాక్ట్‌‌‌‌ కార్మికులకు రూ. 30 లక్షల బీమా
ఆరోగ్యపరమైన సేవలను విస్తృతం చేస్తున్న సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్​ కార్మికులకు రూ. 30 లక్షల ప్రమాద బీమా పథకం అమలు చేసేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇటీవల హెడ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీతో అగ్రిమెంట్‌‌‌‌ సైతం చేసుకుంది. ఈ బ్యాంక్‌‌‌‌లో అకౌంట్‌‌‌‌ ఉన్న వారికి ఈ స్కీమ్‌‌‌‌ వర్తించనుంది. కాంట్రాక్ట్‌‌‌‌ కార్మికులు తమ శాలరీ అకౌంట్‌‌‌‌ ఏ బ్యాంక్‌‌‌‌లో ఉన్నా దానిని హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీకి మార్చుకోవాలని కార్మికులకు అవగాహన కల్పించింది.