గుడ్ న్యూస్: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే.. ఇకపై అన్ని ఆస్పత్రుల్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్

గుడ్ న్యూస్: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే.. ఇకపై అన్ని ఆస్పత్రుల్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేవారికి గుడ్ న్యూస్. ఇకపై దేశంలోని అన్ని ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ ట్రీట‌్‌మెంట్ తీసుకోవచ్చు. గురువారం నుంచే ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చినట్లు ది జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ తెలిపింది. జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు కౌన్సిల్ ప్రకటించింది. ఈ నిర్ణయం కోట్లాది మంది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు మేలు చేస్తుంది. సాధారణంగా.. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పటికీ.. అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ సదుపాయం ఉండదు.

నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో మాత్రమే ఇన్సూరెన్స్ పాలసీదారులకు క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ సదుపాయం ఉంటుంది. అంటే.. ఇన్సూరెన్స్ కంపెనీకి, ఆసుపత్రికి ఒప్పందం ఉంటేనే ఈ విధానం ఉంటుంది. అలా లేని ఆసుపత్రుల్లో ట్రీట్‌మెంట్ తీసుకోవాలంటే రోగులు ముందుగా డబ్బు చెల్లించాలి. ఆ తర్వాత మెడికల్ బిల్లుల్ని, సంబంధిత వివరాలతో కూడిన డాక్యుమెంట్లను కంపెనీకి చెల్లించి, రీయింబర్స్‌మెంట్ పొందాల్సి ఉంటుంది.

కొన్నిసార్లు కంపెనీలు నిబంధనల పేరుతో వీటిని నిరాకరించిన సందర్భాలు కూడా ఉంటాయి. దీంతో వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ ప్రక్రియ చాలా కష్ట సాధ్యంగా ఉండటం, రీఫండ్ ఆలస్యం అవ్వడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై ఏ ఆసుపత్రిలోనైనా క్యాష్‌లెస్ ‌ట్రీట్‌మెంట్ పొందొచ్చు.

నెట‌్‌వర్క్ హాస్పిటల్ లిస్టులో లేని ఆస్పత్రిలో క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ పొందేందుకు 48 గంటల ముందే ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయాలి. అత్యవసర పరిస్థితుల్లో అయితే.. ఆస్పత్రిలో చేరిన 48 గంటల్లోగా సమాచారం ఇవ్వాలి. అనంతరం కంపెనీ నిబంధనలకు అనుగుణంగా.. మెడి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ కొత్త సదుపాయంపై కంపెనీలు వినియోగదారులకు సమాచారం పంపిస్తున్నాయి.