పాక్ ఆటగాళ్లకు ఇక డబ్బులే డబ్బులు.. కోట్లు కుమ్మరించేందుకు PCB గ్రీన్ సిగ్నల్

పాక్ ఆటగాళ్లకు ఇక డబ్బులే డబ్బులు.. కోట్లు కుమ్మరించేందుకు PCB గ్రీన్ సిగ్నల్

వరల్డ్ కప్ 2023 మెగా సమరానికి ముందు పాకిస్తాన్ ఆటగాళ్లకు, ఆ దేశ క్రికెట్ బోర్డుకు మధ్య సఖ్యత కుదరింది. ఐసీసీ ఆదాయంలో ఆటగాళ్లకు వాటా ఇవ్వడానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సూత్రప్రాయంగా అంగీకరించింది. పీసీబీ తీసుకున్న ఈ నిర్ణయంతో పాక్ ఆటగాళ్లకు ఇక మీదట కాసుల వర్షం కురవనుంది.

కొద్దిరోజుల క్రితం మ్యాచ్ ఫీజులు చెల్లించని కారణంగా ఆటగాళ్లు.. పాక్ క్రికెట్ బోర్డుపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ సమస్యను పరిష్కరించక పోతే స్పాన్సర్‌షిప్ లోగోలను, ప్రపంచ కప్ ప్రమోషన్లను బహిష్కరిస్తామని వారు పీసీబీని హెచ్చరించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన పీసీబీ.. మధ్యవర్తిగా చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్ ఉల్ హక్‌ను రంగంలోకి దించి సమస్యకు పరిష్కరించింది.

ఐసీసీ వాటాలో 3 శాతం 

ఆటగాళ్ల తరుపున బాబర్ ఆజాం, పీసీబీ తరుపున ఇంజమామ్ ఈ విషయంపై పలు మార్లు చర్చించారు. పీసీబీ సెంట్రల్ కాంట్రాక్టు పొందిన ఆటగాళ్లకు.. ఐసీసీ నుండి ఆ దేశ క్రికెట్ బోర్డుకు వచ్చే ఆదాయంలో వాటాలో 3 శాతం వాటా ఇవ్వటానికి పీసీబీ చైర్మన్ జకా అష్రాఫ్‌ అంగీకరించినట్లు ఇంజమామ్ వెల్లడించారు. ఈ లెక్కన ఐసీసీ నుండి పీసీబీకి అందుకున్న 34.51 మిలియన్ డాలర్లలో 1.03 మిలియన్ డాలర్లు ఆటగాళ్లకు దక్కనుంది.

Also Read :- రాజ్‌కోట్‌లో దంచి కొడుతున్న ఎండ..స్మిత్ కోసం గ్రౌండ్‌లోనే కుర్చీ

ఎవరికి ఎంత దక్కనుందంటే..?

పీసీబీ నివేదికల ప్రకారం.. కేటగిరీ ఏలో ఉన్న బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ లకు పాక్ కరెన్సీలో నెలకు 45 లక్షలు(ఏడాదికి 54 కోట్లు) దక్కనున్నాయి. ఇక కేటగిరీ బీలో ఉన్న ఆటగాళ్లకు నెలకు 30 లక్షలు అందనుండగా, కేటగిరీ సి, డిలో ఉన్న ఆటగాళ్లు 7 లక్షల నుండి 15 లక్షల మధ్య అందుకోనున్నారు. అయితే, ఇందులో పన్ను రూపంలో 10 శాతం బోర్డుకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రపంచ కప్ నుండి స్వదేశానికి తిరిగి వెళ్ళాక ఆటగాళ్లు ఈ ఒప్పందంపై సంతకం చేయనున్నారని సమాచారం. ఇది ఒకరకంగా పాక్ క్రికెటర్లకు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి.