అబుదాబి: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న అఫ్గానిస్తాన్.. ఆసియా కప్‌లో బోణీ చేసింది. బ్యాటింగ్‌లో సెదిఖుల్లా అటల్ (73 నాటౌట్), అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (53) చెలరేగడంతో.. మంగళవారం (సెప్టెంబర్ 09) జరిగిన టోర్నీ తొలి మ్యాచ్‌లో అఫ్గాన్ 94 రన్స్ తేడాతో హాంకాంగ్‌పై నెగ్గింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 188/6 స్కోరు చేసింది.
ఆరంభంలో విజృంభించిన హాంకాంగ్ బౌలర్లు ఆరు బాల్స్ తేడాలో రెహమానుల్లా గుర్బాజ్ (8), ఇబ్రహీం జద్రాన్ (1)ను ఔట్ చేశారు. 26/2తో కష్టాల్లో పడిన జట్టును సెదిఖుల్లా, మహ్మద్ నబీ (31) మూడో వికెట్‌కు 51 రన్స్ జోడించి ఆదుకున్నారు. తర్వాత సెదిఖుల్లా చివరి వరకు క్రీజులో ఉండి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు.
గుల్బాదిన్ నైబ్ (5) ఫెయిలైనా అజ్మతుల్లా వేగంగా ఆడాడు. సెదిఖుల్లాతో ఐదో వికెట్‌కు 35 బాల్స్‌లోనే 82 రన్స్ జత చేశాడు. కరీమ్ జనత్ (2) నిరాశపర్చాడు. ఆయుష్ శుక్లా, కించిత్ షా చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత ఛేజింగ్‌లో హాంకాంగ్ 20 ఓవర్లలో 94/9 స్కోరుకే పరిమితమైంది. బాబర్ హయత్ (39) టాప్ స్కోరర్.
కెప్టెన్ వసీమ్ ముర్తజా (16)తో సహా అందరూ ఫెయిలయ్యారు. ఇన్నింగ్స్‌లో 9 మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఫజల్‌హక్, గుల్బాదిన్ నైబ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అజ్మతుల్లాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
