న్యూఢిల్లీ: ఇండియా వెటరన్ ప్లేయర్ రోహన్ బోపన్న.. రెండు దశాబ్దాల ప్రొఫెషనల్ టెన్నిస్‌కు శనివారం వీడ్కోలు పలికాడు. ఇండియా తరఫున గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన నలుగురు ప్లేయర్లలో ఒకడిగా రికార్డులకెక్కిన బోపన్న.. ఈ వారం ప్రారంభంలో పారిస్ మాస్టర్స్‌లో చివరి మ్యాచ్ ఆడాడు. అలెగ్జాండర్ బుబ్లిక్‌తో కలిసి బరిలోకి దిగినా తొలి రౌండ్‌లోనే ఓటమిపాలయ్యాడు. ‘ఆటకు గుడ్‌బై చెబుతున్నా. అధికారికంగా రాకెట్‌ను వదిలేస్తున్నా. 20 ఏండ్ల మరపురాని పర్యటనల తర్వాత ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది.
ఇండియాలో కూర్గ్ అనే చిన్న పట్టణం నుంచి నా ప్రయాణాన్ని ఆరంభించాను. నా సర్వ్‌ను బలోపేతం చేయడానికి చెక్క దిమ్మెలపై కొట్టా. స్టామినాను పటిష్టం చేసుకోవడానికి కాఫీ ఎస్టేట్స్ వెంట జాగింగ్ చేశా. నా కలను సాకారం చేసుకునేందుకు పగిలిన కోర్టుల్లో ఆటాడా. ప్రపంచంలోని అతిపెద్ద మైదానాల్లో లైట్ల కింద నిలబడి ఆడినప్పుడు ఇవన్నీ చాలా అవాస్తవికంగా అనిపిస్తాయి’ అని భావోద్వేగంతో కూడిన ప్రకటనను బోపన్న విడుదల చేశాడు. పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఇండియా తరఫున అధికారికంగా డేవిస్ కప్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ‘నేను కోర్టులోకి అడుగుపెట్టిన ప్రతిసారి నా పట్టుదలకు, ఎదుగుదలకు, పోరాడటానికి టెన్నిస్ ఎంతో సాయపడింది. నేను ఆటను ఎందుకు ప్రారంభించానో ప్రతిసారీ గుర్తు చేసింది. నా తల్లిదండ్రుల త్యాగాలకు, సోదరి రష్మిక ప్రోత్సాహానికి, కోర్టు వెలుపలా గొప్ప భాగస్వామిగా నిలిచిన భార్య సుప్రియకు కృతజ్ఞతలు, నా కుమార్తె త్రిధ కొత్త ఉద్దేశం, మృదువైన బలాన్ని ఇచ్చింది’ అని బోపన్న పేర్కొన్నాడు. 2000లో ప్రొషెషనల్ ప్లేయర్‌గా మారిన బోపన్న ఏటీపీ టూర్‌లో బలమైన సర్వీస్‌లు కొట్టడంలో దిట్టగా పేరు పొందాడు.
ఇండియా తరఫున అత్యంత విజయవంతమైన డబుల్స్ ప్లేయర్లలో ఒకరిగా నిలిచాడు. కెరీర్‌లో డేవిస్ కప్, గ్రాండ్‌స్లామ్, ఒలింపిక్స్‌లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 2017లో గాబ్రియోలా డబ్రోవోస్కి (కెనడా)తో కలిసి ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను నెగ్గాడు. 2024లో మాథ్యూ ఎబ్దెన్‌తో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. 2023లో ఎబ్డెన్‌తో కలిసి ఇండియన్ వేల్స్ ట్రోఫీని గెలవడంతో పాటు 43 ఏండ్ల వయసులో ఏటీపీ మాస్టర్స్ చాంపియన్‌గా నిలిచాడు. 2024లో డబుల్స్ వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌ను సాధించిన అతి పెద్ద వయస్కుడిగా రికార్డులకెక్కాడు.
