గూగుల్ సంస్థలో మరోసారి అంతర్గత అలజడి మొదలైంది. అమెరికా ప్రభుత్వ విభాగాలైన డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ లతో గూగుల్‌కి కున్న ఒప్పందాలను వ్యతిరేకిస్తూ దాదాపు వెయ్యి మంది ఉద్యోగులు గళమెత్తారు. "గూగుల్ డిమాండ్స్: వర్కర్ సేఫ్టీ & ICE కాంట్రాక్ట్ ట్రాన్స్‌పరెన్సీ" పేరుతో రూపొందించిన పిటిషన్‌పై సంతకాలు చేసి, తమ నిరసనను కంపెనీ దృష్టికి తీసుకెళ్లారు. గూగుల్ సాంకేతికత హింసకు, నిఘాకు, అణచివేతకు సాధనంగా మారుతోందని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పిటిషన్‌లో ఉద్యోగులు ప్రధానంగా గూగుల్ క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సరిహద్దుల వెంబడి నిఘా వ్యవస్థలను బలోపేతం చేయడానికి, వలసదారులను ట్రాక్ చేసే 'పాలంతీర్ ఇమ్మిగ్రేషన్ ఓఎస్' వంటి సిస్టమ్‌లకు గూగుల్ క్లౌడ్ వెన్నుముకగా నిలుస్తోందని వారు ఆరోపించారు. కేత్ పోర్టర్, రెనీ గుడ్, అలెక్స్ ప్రెట్టి వంటి వారి మరణాలకు కారణమైన హింసాత్మక వాతావరణానికి గూగుల్ టెక్నాలజీ పరోక్షంగా ఆజ్యం పోస్తోందని ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గూగుల్ కంపెనీపై.
కేవలం క్లౌడ్ సేవలే కాకుండా.. గూగుల్ జనరేటివ్ ఏఐ కూడా ప్రభుత్వ విభాగాల సామర్థ్యాన్ని పెంచేందుకు వాడటంపై వారు విస్మయం వ్యక్తం చేశారు. యూట్యూబ్‌లో ఐసీఈ రిక్రూట్‌మెంట్ ప్రకటనలు రావడం, అలాగే ఇమ్మిగ్రెంట్ల రక్షణ కోసం రూపొందించిన ట్రాకింగ్ యాప్‌లను ప్లే స్టోర్ నుండి తొలగించడం వంటి చర్యలను ఉద్యోగులు తప్పుబట్టారు. ఈ టెక్నాలజీలను రూపొందిస్తున్న ఉద్యోగులుగా.. తమ శ్రమ ఇలాంటి హింసాత్మక పనులకు ఉపయోగపడటం మమ్మల్ని భయపెడుతోందని లేఖలో పేర్కొన్నారు.
తమ డిమాండ్ల విషయంలో ఉద్యోగులు చాలా స్పష్టంగా ఉన్నారు. ప్రభుత్వ విభాగాలతో ఉన్న అన్ని ఒప్పందాలను బహిర్గతం చేయాలని, తక్షణమే ఆ కొలాబరేషన్స్ నుంచి గూగుల్ తప్పుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై చర్చించేందుకు ఏఐ ప్రమేయం లేని.. ప్రత్యక్షంగా నాయకత్వంతో కూడిన ఎమర్జెన్సీQ&A సెషన్ నిర్వహించాలని కోరారు. అలాగే సంస్థలోని కేఫ్టీరియా కార్మికుల నుంచి డేటా సెంటర్ ఉద్యోగుల వరకు అందరికీ రక్షణ కల్పించేలా వర్క్ ఫ్రమ్ హోమ్, చట్టపరమైన మద్దతు వంటి భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. గూగుల్ తన ఉత్పత్తులను ప్రభుత్వ అణచివేతకు వాడకుండా ఖచ్చితమైన పరిమితులు విధించాలని ఉద్యోగులు గట్టిగా కోరుతున్నారు.
