ఒకరి వీడియోలు మరొకరికి.. గూగుల్ ఫొటోస్ యాప్​లో బగ్

ఒకరి వీడియోలు మరొకరికి.. గూగుల్ ఫొటోస్ యాప్​లో బగ్

గూగుల్ ఫొటోస్ యాప్ యూజర్లలో కొంత మందికి సంబంధించిన వీడియోలు లీకయ్యాయి. ఒకరికి సంబంధం లేని వీడియోలు మరొకరికి డౌన్ లోడ్ అయ్యాయి. పోయినేడాది నవంబర్ 21 నుంచి 25 మధ్య గూగుల్ ఫొటోస్ నుంచి ఎవరైతే యూజర్లు బ్యాకప్ చేసుకున్నారో… అప్పుడు వారికి సంబంధం లేని వీడియోలు కూడా డౌన్ లోడ్ అయినట్లు తేలింది. యాప్ లో తలెత్తిన సాంకేతిక లోపం వల్లనే ఇలా జరిగిందని తెలిసింది. వీడియోలు లీకైన మాట వాస్తవమేనని గూగుల్ అంగీకరించింది. యూజర్లకు కలిగినఈ అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. ‘‘నవంబర్ 21–25 మధ్య గూగుల్ ఎక్స్ పోర్ట్ సర్వీస్ ద్వారా ఫొటోలు డౌన్​లోడ్ చేసుకున్న యూజర్లకు ఈ సమస్య తలెత్తింది. యాప్​లో బగ్ వల్ల వారికి సంబంధం లేని వీడియోలు కొన్ని యూజర్ల ఆర్కైవ్స్ లోకి వచ్చాయి. 0.01 శాతం కంటే తక్కువ యూజర్లపైనే దీని ప్రభావం పడింది” అని గూగుల్ తెలిపింది. టెక్నికల్ ఇష్యూను సాల్వ్ చేశామని, ఈ తేదీల్లో ఫొటోస్ డౌన్ లోడ్ చేసుకున్న యూజర్లు వాటిని డిలీట్ చేసి మళ్లీ కొత్తగా ఎక్స్ పోర్ట్ చేసుకోవాలని సూచించింది. అయితే, ఏయే అకౌంట్లకు సంబంధించిన డేటా లీకైందో మాత్రం చెప్పలేదు.