గూగుల్ లో కరోనా టెస్టింగ్ సెంటర్ల వివరాలు

గూగుల్ లో కరోనా టెస్టింగ్ సెంటర్ల వివరాలు

కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. దీంతో డాక్టర్లు వైరస్‌ నిర్ధారణ పరీక్షలు భారీ స్థాయిలో చేపడుతున్నారు. అయితే కరోనా నిర్ధారణ పరీక్షా కేంద్రాలు ఎక్కడున్నాయనే దానిపై ప్రజలకు సరైన అవగాహన లేదు.  దీనికోసం గూగుల్‌ సంస్థ మరో సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. గూగుల్‌ సెర్చ్‌, అసిస్టెంట్‌, మ్యాప్‌లు, భారత వైద్య పరిశోధన మండలి (ICMR) ఆమోదించిన కరోనా కేంద్రాల వివరాలను ప్రజలకు తెలియజేసేందుకు సహాయపడుతాయని గూగుల్‌ ప్రకటించింది. దీనికోసం ICMRతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది. ఇంగ్లిష్‌తోపాటు మరో ఎనిమిది భాషల్లో ఈ ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉండనుంది.

సెర్చ్ లో కొవిడ్‌ టెస్టింగ్‌ అని కానీ… కరోనావైరస్‌ టెస్టింగ్‌ పేరుతో సెర్చ్ చేస్తే వారికి దగ్గరలోని టెస్టింగ్‌ సెంటర్ల సమాచారం వస్తుంది. కొవిడ్‌-19 అలెర్ట్‌ సమాచారంలో భాగంగా సెర్చ్ లో టెస్టింగ్‌ అనే కొత్త ఫీచర్‌ను గూగుల్‌ ఏర్పాటు చేసింది. దీనికోసం దేశంలో దాదాపు 300పట్టణాల్లో ఉన్న 700 కరోనా టెస్టింగ్‌ కేంద్రాల పూర్తి సమాచారాన్ని పొందుపరచినట్లు గూగుల్‌ ప్రకటించింది. అంతేకాదు కరోనా వైరస్‌కు సంబంధించి లెక్కలు, వైరస్‌ లక్షణాలు, చికిత్స, నివారణ వంటి ఫీచర్లను ఇప్పటికే పొందుపరచిన గూగుల్‌…లేటెస్టు సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌ డేట్‌ చేస్తోంది.