- పలు రంగాల్లో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చిన
- గూగుల్, యూనిలీవర్, రాయల్ ఫిలిప్స్ సంస్థలు
- దావోస్ వేదికగా కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ బృందం చర్చలు
- భారత్ ఫ్యూచర్ సిటీకి యూఏఈ హస్తం.. జాయింట్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుకు నిర్ణయం
- స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఏటా 5 వేల మందికి ఉపాధి.. సౌదీ సంస్థ వెల్లడి
- ఏఐతో పౌర సేవలు.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ టార్గెట్: సీఎం రేవంత్
హైదరాబాద్, వెలుగు: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో రాష్ట్రానికి పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. తొలిరోజు గూగుల్, యూనిలీవర్, రాయల్ ఫిలిప్స్‌లాంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో భాగస్వామ్యాలకు, పెట్టుబడులకు సిద్ధమని ప్రకటించాయి. భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్‌కు యూఏఈ ప్రభుత్వం, స్కిల్ డెవలప్‌మెంట్‌కు సౌదీ అరేబియా సంస్థలు సహకారం అందించేందుకు ముందుకు రాగా, ఇజ్రాయెల్ సంస్థలతో కలిసి స్టార్టప్ రంగంలో పైలెట్ ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ సంకల్పమని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఉపయోగించుకుని పౌర సేవలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా ప్రజలకు చేరవేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రైతు భరోసా సబ్సిడీల ట్రాకింగ్, ఆస్తి పన్ను వసూళ్లు, మహిళా సంక్షేమ పథకాల అమలులో ఏఐ ఆధారిత పరిష్కారాలను వాడుతున్నామని తెలిపారు. డబ్ల్యూఈఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చా వేదికపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. ఏఐని వాడుకొని ప్రభుత్వ సేవలను మరింత పారదర్శకం చేస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో నోకియా సీఈవో జస్టిన్ హోటార్డ్, హిటాచి సీఈవో తోషియాకి టోకునాగా, జర్మనీ డిజిటల్ మంత్రి కార్ స్టెన్ వైల్డ్ బెర్గర్‌సహా పలువురు అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొన్నారు.
గూగుల్ ఆసియా పసిఫిక్ ఏరియా (ఏపీఏసీ) ప్రెసిడెంట్ సంజయ్ గుప్తాతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్‌లు, వ్యవసాయం, వాతావరణ మార్పుల రంగాల్లో సహకారం అందించేందుకు గూగుల్ ముందుకొచ్చింది. ప్రాంతీయ ఆర్థిక వృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న క్యూర్, ప్యూర్, రేర్ నమూనాలను సీఎం వివరించారు. కోర్ హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు గూగుల్ మద్దతు కోరారు. వ్యవసాయ రంగంలో ఎరువుల అతి వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని చర్చించారు. హైదరాబాద్‌లో తొలి ‘గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్’ ఏర్పాటు చేసినందుకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణకు పూర్తిస్థాయిలో మద్దతు అందిస్తామని గూగుల్ ఏపీఏసీ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విస్తృత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో యూనిలీవర్ జీసీసీ ఏర్పాటు..
హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటుపై యూనిలీవర్ ఆసక్తి వ్యక్తం చేసింది. ఆ కంపెనీ ఉన్నతాధికారి విల్లెమ్ ఉయిజెన్‌తో సీఎం రేవంత్ బృందం సమావేశమైంది. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు హైదరాబాద్ కేంద్రంగా మారుతున్నదని వివరించారు. ఇప్పటికే మెక్‌డొనాల్డ్స్, హైనెకెన్, కాస్టకోలాంటి సంస్థల జీసీసీలు హైదరాబాద్‌లో విజయవంతంగా పనిచేస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ప్లాస్టిక్ తగ్గింపు, పునరుత్పాదక శక్తిలాంటి యూనిలీవర్ లక్ష్యాలను తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలతో అనుసంధానించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కోరారు. తెలంగాణలోని పారిశ్రామిక పార్కుల్లో త్వరగా వినియోగ వస్తువుల (ఎఫ్‌ఎంసీజీ) తయారీ రంగంలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాలని యూనిలీవర్‌ను సీఎం బృందం కోరింది. వాతావరణ పరిరక్షణ, నీటి వినియోగంలో సానుకూలత, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపులాంటి యూనిలీవర్ లక్ష్యాలను, తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న పునరుత్పాదక శక్తి, నీటి సంరక్షణ, సర్క్యులర్ ఎకానమీ కార్యక్రమాలతో అనుసంధానం చేసే అంశాలపై కూడా చర్చలు జరిగాయి.
హెల్త్ టెక్‌లో ఏఐ భాగస్వామ్యానికి రాయల్ ఫిలిప్స్ మొగ్గు
ఏఐ రంగంలో తెలంగాణతో భాగస్వామ్యమయ్యేందుకు ప్రముఖ హెల్త్ టెక్ సంస్థ రాయల్ ఫిలిప్స్ ఇంట్రెస్ట్చూపించింది. హైదరాబాద్‌లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటు అవకాశాలపై కూడా చర్చించేందుకు ముందుకొచ్చింది. ఫిలిప్స్ గ్లోబల్ నాయకత్వంతో ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందం భేటీ అయింది. రాయల్ ఫిలిప్స్ వైస్ ప్రెసిడెంట్ , గ్లోబల్ హెడ్ జాన్ విల్లెమ్– స్కీజ్ గ్రాండ్ మాట్లాడుతూ.. ఏఐ రంగంలో తెలంగాణ చేపడుతున్న కార్యక్రమాలు తమను ఆకట్టుకున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘తెలంగాణ నెక్స్ట్–జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–2030’ గురించి ప్రతినిధి బృందం వివరించింది.
2030 నాటికి 250 బిలియన్ డాలర్ల లైఫ్ సైన్సెస్ ఆర్థిక వ్యవస్థ నిర్మించడమే ఈ విధాన లక్ష్యమని, మెడికల్ ఎలక్ట్రానిక్స్ సహా అనుబంధ రంగాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఔషధ తయారీ, పరిశోధనాభివృద్ధి (ఆర్ అండ్ డీ) రంగాల్లో ప్రపంచస్థాయి, స్థిరమైన పారిశ్రామిక క్లస్టర్‌ను తెలంగాణలో నిర్మిస్తున్నామని చెప్పారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌లో భాగంగా ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) , రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ ఆర్) మధ్యనున్న ప్రాంతంలో పెరి–అర్బన్ రీజియన్ ఎకానమీ (ప్యూర్) తయారీ, లాజిస్టిక్స్ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కొత్త లైఫ్ సైన్సెస్ విధానం, ఔషధ తయారీ వ్యూహాలు కలిసి తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు పునాది వేస్తాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. భవిష్యత్తులో హైదరాబాద్‌ను ఏఐ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏఐ సిటీని నిర్మిస్తున్నదని వివరించారు. హైదరాబాద్‌లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయడానికి ఇది ఉత్తమ అవకాశమని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణకు వచ్చి.. జీనోమ్ వ్యాలీని సందర్శించాలని ఫిలిప్స్ నాయకత్వాన్ని ఆహ్వానించారు. జాన్ విల్లెమ్– స్కీజ్ గ్రాండ్ మాట్లాడుతూ.. ఆరోగ్య రంగంలో తెలంగాణ చేపడుతున్న ఏఐ ఆధారిత మార్పు ప్రశంసనీయమని అన్నారు.
స్కిల్ వర్సిటీ ద్వారా సౌదీకి ఏటా 5వేల మంది..
సౌదీకి చెందిన ‘ఎక్స్‌పర్టైజ్’ సంస్థ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో భాగస్వామ్యానికి ముందుకొచ్చింది. ఏటా 5వేల మంది నైపుణ్యం ఉన్న సిబ్బంది తమకు అవసరమని, స్కిల్ యూనివర్సిటీ ద్వారా వారికి శిక్షణ ఇచ్చి నియమించుకుంటామని సంస్థ సీఈవో మొహమ్మద్ ఆసిఫ్ తెలిపారు. కాగా, రాష్ట్రంలో నిర్మిస్తున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు యూఏఈ ప్రభుత్వం ముందుకొచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డితో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీ భేటీ అయి, ప్రాజెక్టు వేగవంతం కోసం జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇది దేశంలోనే తొలి నెట్-జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీ అని, మారుబేని, సెమ్ కార్ప్‌లాంటి సంస్థలు ఇప్పటికే భాగస్వాములుగా ఉన్నాయని సీఎం రేవంత్ వివరించారు. రిలయన్స్ వంతారాతో జూ ఏర్పాటు ఒప్పందాన్ని కూడా సీఎం ప్రస్తావించారు.
ఇజ్రాయెల్ స్టార్టప్‌లతో పైలెట్ ప్రాజెక్టులు
ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ చైర్మన్ అలోన్ స్టోపెల్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. అగ్రి-టెక్, హెల్త్ టెక్, సైబర్ సెక్యూరిటీ, ఏరో స్పేస్ రంగాల్లో ఇజ్రాయెల్ స్టార్టప్‌లతో కలిసి తెలంగాణలో పైలెట్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించాలని నిర్ణయించారు. డీప్‌టెక్ ఇన్నోవేషన్‌లో తెలంగాణ స్టార్టప్‌లకు ఇజ్రాయెల్ సహకారం అందనున్నది. సీఎంతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
