ఉద్యమకారులకు కేసీఆర్​ చేసిందేమీలేదు

ఉద్యమకారులకు కేసీఆర్​ చేసిందేమీలేదు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలతో సీఎం కేసీఆర్​ గద్దెనెక్కారే తప్ప ఉద్యమకారులకు ఆయన చేసిందేమీ లేదని1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకుల సంఘం కన్వీనర్ ​ఎస్. గోపాల్​రావు అన్నారు. ‘వీ6 వెలుగు’తో శనివారం ఆయన మాట్లాడారు. ఎవరో ఒక్కరు దీక్ష చేసినంత మాత్రాన రాష్ట్రం రాలేదన్నారు. తన దీక్షతోనే  కేంద్రం దిగివచ్చి తెలంగాణ ఇచ్చిందని కేసీఆర్ చెప్పుకోవడం ఉద్యమకారులను అవమానించడమేనని మండిపడ్డారు. 

1969 నుంచి 2014 వరకు ఎంతోమంది ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానాలు చేసుకున్నారని అన్నారు. ఉద్యమకారుల్లో ప్రాణాలతో మిగిలి ఉన్న వారిని కలవడానికి కూడా కేసీఆర్ సమయం ఇవ్వడం లేదన్నారు. ఎన్నోసార్లు అపాయింట్​మెంట్​ అడిగినా ఇవ్వకుండా ఉద్యమకారులను అవమానిస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందడానికే అమరజ్యోతి ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారని విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా కేసీఆర్​ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారని చెప్పారు. దశాబ్ది ఉత్సవాలు పచ్చి బూటకమన్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఉత్సవాల పేరుతో ప్రభుత్వ సొమ్మును వృథా చేయడమేంటని ప్రశ్నించారు.