
- ధర్మద్రోహ పార్టీల్లో చేరబోను
హైదరాబాద్ సిటీ, వెలుగు: బీజేపీ హైకమాండ్ ఆదేశిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. తాను ఏ పార్టీలో చేరబోనన్నారు. తన ధర్మం గురించి ఏ పార్టీలో మాట్లాడడానికి ఫ్రీడమ్ ఇస్తే ఆ పార్టీలో ఉంటానని చెప్పారు. గోషామహల్ బీజేపీ అడ్డా అని, ఇప్పటికైతే అక్కడ ఎలాంటి ఉప ఎన్నిక రాదన్నారు. కానీ, తనను రాజీనామా చేయాలని హైకమాండ్ ఆదేశిస్తే తప్పకుండా చేస్తానని తెలిపారు. లక్షలాది కార్యకర్తల అభిప్రాయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించానని, కానీ ఇందులో ఫెయిల్ అయ్యానన్నారు. దీంతో పార్టీ నుంచి బయటకు వచ్చానని చెప్పారు.
అయితే, మోదీ, అమిత్ షా, యోగి కార్యక్రమాలను ప్రచారం చేస్తానని చెప్పారు. ధర్మ ద్రోహానికి పాల్పడే ఏ పార్టీలోనూ చేరబోనని ఆయన స్పష్టం చేశారు. గతంలో బీఆర్‌ఎస్ పార్టీ.. ఎంఐఎంను నెత్తిన పెట్టుకుందని, ఇప్పుడు కాంగ్రెస్ అదే చేస్తోందని, అలాంటి పార్టీలో చేరలేనన్నారు. అంతకుముందు ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై రాజాసింగ్ మాట్లాడుడూ.. బోనాలు తెలంగాణకే ప్రత్యేకమని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి హిందువు మీద అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. తాగి, ఆడే బోనాలని ఈ పండుగపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బోనాల సంస్కృతిపై ఏండ్ల తరబడి కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. గోశాలలు కట్టేందుకు మీ సహకారం కావాలని ఓ మంత్రి అడిగారని చెప్పారు. గోవధ నిషేధ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. సింహవాహిని అమ్మవారి టెంపుల్‌ను కాంగ్రెస్ ప్రభుత్వమైనా విస్తరించాలని ఆయన కోరారు.