విద్యార్థినులపై వేధింపుల ఘటన..వర్సిటీని తనిఖీ చేసిన రాజాసింగ్

విద్యార్థినులపై వేధింపుల ఘటన..వర్సిటీని తనిఖీ చేసిన రాజాసింగ్

బషీర్‌‌బాగ్, వెలుగు: కోఠి వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో విద్యార్థినులను వేధించిన ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. సోమవారం యూనివర్సిటీకి చేరుకున్న ఆయన పరిస్థితిని పరిశీలించారు. యూనివర్సిటీలోని సీసీటీవీ కెమెరాలను సిబ్బందితో కలిసి పరిశీలించారు. వైస్‌‌ చాన్సలర్ సూర్య ధనుంజయతో భేటీ అయి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. 

విద్యార్థినులను వేధిస్తున్న మెస్ ఇన్‌‌చార్జి వినోద్‌‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వీసీని కోరారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్​ చేశారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. వీసీ ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

షీ టీమ్స్ పోలీసులు కూడా ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. సుమారు 650 మంది విద్యార్థులు నివసించే హాస్టల్‌‌లో కేవలం మూడు సీసీటీవీ కెమెరాలు మాత్రమే ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.