కోలుకోని బాధితులు.. సర్జరీ పైసలియ్యని సర్కారు

కోలుకోని బాధితులు.. సర్జరీ పైసలియ్యని సర్కారు
  • నేటికీ క్యాంప్ ఆఫీసుల చుట్టూ బాధితుల ప్రదక్షిణలు 
  • బాధ్యులపై చర్యలేవి ?

సూర్యాపేట​, వెలుగు : సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో  ప్రమాదం జరిగి ఏడాది దాటుతోంది. కానీ, ఇప్పటివరకు ఈ ఘటనలో గాయపడి సొంతంగా  ట్రీట్​మెంట్​ చేయించుకున్న వారికి డబ్బులు ఇవ్వలేదు. లక్షల్లో ఖర్చయితే వేలల్లో ఇవ్వడంతో ఇప్పటికీ బాధితులు ఆఫీసర్లు, ఎమ్మెల్యే, మంత్రులు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అలాగే ప్రమాదం జరగడానికి కారకులెవరో గుర్తించి చర్యలు తీసుకున్నదీ లేదు. జాతీయ స్థాయి పోటీలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన నిర్వాహకులు ఏర్పాట్లు మాత్రం అందుకు తగ్గట్టు చేయకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పందిరి వేసే వారితో గ్యాలరీ నిర్మించడంతో వందల మంది పోటీలు చూస్తుండగా  కుప్పకూలిపోయింది. 100 మందికి గాయాలు కాగా ఒకరు చనిపోయారు. 

ఇదీ జరిగింది...
మంత్రి జగదీశ్​రెడ్డి  తల్లి గుంటకండ్ల సావిత్రమ్మ పేరుతో ఏర్పాటు చేసిన ఎస్  ఫౌండేషన్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లాలో గత ఏడాది మార్చి 22 నుంచి 25వ తేదీ వరకు 47వ నేషనల్ కబడ్డీ పోటీలను నిర్వహించారు. 29 రాష్ట్రాల నుంచి 720 మంది ప్లేయర్స్ ను ఆహ్వానించారు. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్​, ఎస్ ​ఫౌండేషన్​ ఏర్పాట్లు చేశాయి. రూ.7 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేయగా, ప్రభుత్వం రూ.20 లక్షలు ఫండ్స్ రిలీజ్​చేసింది. మిగిలిన అమౌంట్ స్పాన్సర్స్ చూసుకున్నారు. జిల్లా కేంద్రంలో పోటీలు నిర్వహించేందుకు అనువైన స్టేడియం లేకపోయినా పోలీస్​ పరేడ్​గ్రౌండ్​లో అప్పటికప్పుడు పనులు మొదలుపెట్టారు. వేలాది మంది చూడడానికి వచ్చే అవకాశం ఉండడంతో ఒక్కో గ్యాలరీలో 5 వేల మంది కూర్చునేలా మూడు గ్యాలరీలను డిజైన్ ​చేశారు. వీటి నిర్మాణానికి రూ.1.2 కోట్లతో ఎస్టిమేషన్​ వేయగా కాంట్రాక్టర్ మాత్రం రూ.80లక్షల్లోనే కంప్లీట్​చేశాడు. గత ఏడాది మార్చి 22 న కొద్దిసేపట్లో పోటీలు ప్రారంభమవుతాయనగా, ఒక గ్యాలరీలో 1500 మంది వరకు కూర్చున్నారు. దీంతో బరువు ఎక్కువై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా, 26మంది తీవ్రంగా, మరో 100మంది స్వల్పంగా గాయపడ్డారు. ఏడాది గడుస్తున్నా నేటికీ 11మంది కోలుకోలేక ఇంటికే పరిమితమయ్యారు.  

అంతన్నారు..ఇంతన్నారు... 
గాయపడిన వారికి ఫ్రీ ట్రీట్​మెంట్​అందిస్తామని మంత్రి జగదీశ్​రెడ్డి హామీ ఇచ్చారు. స్వల్పంగా గాయపడితే రూ.10వేలు, తీవ్రంగా గాయపడితే రూ.50వేలు ఇచ్చారు. 26 మంది తీవ్రంగా గాయపడడంతో ఆపరేషన్ కోసం హైదరాబాద్ కు తరలించారు. మొదట నిమ్స్ హాస్పిటల్ లో అడ్మిట్ చేసేందుకు తీసుకువెళ్లగా పట్టించుకోలేదు. దీంతో గాయపడిన వారి కుటుంబసభ్యులు యశోద, కామినేని లాంటి ప్రైవేట్​ హాస్పిటల్స్​కు తీసుకువెళ్లి ఆపరేషన్లు చేయించారు. దీని కోసం ఒక్కొక్కరు రూ.3లక్షల నుంచి రూ.10లక్షలకు పైగా ఖర్చు చేశారు. ఘటనతో కబడ్డీ ఫెడరేషన్ తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించగా, ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి సాయం అందలేదు. 

బాధితుల పడిగాపులు 
ఆపరేషన్ల కోసం జేబులో నుంచి డబ్బులు పెట్టుకున్నవారు అప్పటి నుంచి ఆ పైసల కోసం క్యాంప్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా పట్టించుకున్నవారు లేరు. ఒకరిద్దరికి వెన్నుపూస దెబ్బ తినడంతో మంచానికే పరిమితమవ్వగా, హామీ ఇచ్చిన లీడర్లు సాయం చేస్తారన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రమాద సమయంలో గాయపడిన పలువురికి ట్రీట్​మెంట్ ఇచ్చిన పలు హాస్పిటల్స్​కు కూడా ఇప్పటి వరకు బిల్లులు కూడా చెల్లించలేదని సమాచారం.

రూ.10.70 లక్షలకు రూ.60వేలిచ్చారు 
గ్యాలరీ కూలడంతో నా వెన్నుపూస దెబ్బతిన్నది. హైదరాబాద్ లో ఆపరేషన్​కు రూ.10.70లక్షలు ఖర్చయ్యింది. బిల్లులు పెడితే సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తామని చెప్పారు. కానీ, రూ.60 వేలే ఇచ్చారు. అడిగితే ఇంతేనంటున్నారు.  ఇప్పటికీ నడవలేకపోతున్నా. ప్రభుత్వం ఆదుకోవాలి. 
- యాల్క సంతోష్, తాళ్ల ఖమ్మం పహాడ్

ఎంక్వైరీ చేస్తున్నాం 
కబడ్డీ గ్యాలరీ ఘటనపై ఎంక్వైరీ నడుస్తోంది. దీంతో చార్జి షీట్ నమోదు చేయలేదు. బాధ్యులైన వారిపై  చర్యలు తీసుకుంటాం.  
- మోహన్ కుమార్, డి‌‌ఎస్‌‌పి, సూర్యాపేట