డీలిమిటేషన్​పై దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావడం భేష్ : కె. కేశవరావు

డీలిమిటేషన్​పై దక్షిణాది  రాష్ట్రాలు ఏకం కావడం భేష్ : కె. కేశవరావు
  • ప్రభుత్వ సలహాదారుడు కేశవరావు

హైదరాబాద్, వెలుగు: డీలిమిటెషన్ పై దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావడం శుభపరిణామమని ప్రభుత్వ సలహాదారుడు కె. కేశవరావు తెలిపారు. ఆదివారం బంజారాహిల్స్​లోని ఆయన నివాసంలో  మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్ సమస్యను సహనంతో పరిష్కరించాలని, తమకు యూనిటీ ఆఫ్ నేషన్ కావాలని అడుగుతున్నామని చెప్పారు. ఈ విషయంలో అందరిని కలుపుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎన్డీయేతో సంబంధం లేని పార్టీలన్నీ కలిశాయని, ఓపికతో ముందుకెళ్లాలని సూచించారు.

 బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి వ్యాఖ్యలు కించపరిచేలా ఉన్నాయని, ఈ విధంగా మాట్లాడటం సరికాదన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తక్కువ కాబట్టి వాటికి డీలిమిటేషన్ తో ఇబ్బంది కలుగుతుందని వివరించారు. ఉదాహరణకు10 లక్షల జనాభాకు ఒక ప్రతినిధి అవసరమనుకుంటే1,875 సీట్లు అవసరం అవుతాయని, యూపీకి14 పెరుగుతాయని, బిహార్​కు 7 ఇలా నార్త్ లో పెరుగుతాయని, తెలంగాణకు 2 సీట్లు, ఏపీకి 5 సీట్లు తగ్గుతాయన్నారు. దీనిని సీఎం రేవంత్ రెడ్డి అసలు ఒప్పుకోబోమని చెప్పారన్నారు. దేశంలోని అన్ని పార్టీలతో ఆయన హైదరాబాద్ లో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ అంశంపై యుద్ధ ప్రాతిపదికన ఎన్డీఏ వ్యతిరేక పార్టీలు పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు.