న్యూఢిల్లీ: కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. మ్యూటెంట్‌గా తన రూపం మార్చుకొని వైరస్ అటాక్ చేస్తోంది. బ్రిటన్‌లో మ్యూటెంట్ కరోనా వైరస్ అవుటాఫ్ కంట్రోల్‌గా వ్యాపిస్తోంది. మునుపటి వైరస్ కన్నా ఈ మ్యూటెంట్ మరింత వేగంగా వ్యాపిస్తోందని బ్రిటన్ వెల్లడించింది. ఇవ్వాళ ఒక్కరోజే ఆ దేశంలో 24 వేల కొత్త కేసులు నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ అంశంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది.
ప్రజలు భయాందోళనలకు గురి కావొద్దని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్దన్ అన్నారు. ‘ప్రస్తుత తరుణంలో ఏవేవో ఊహించుకొని భయాందోళనకు గురవ్వొద్దు. ప్రభుత్వం పూర్తి అప్రమత్తతతో ఉంది. గత ఏడాది సమయంలో ప్రజల రక్షణను దృష్టిలో పెట్టుకొని అన్ని సమర్థవంతమైన, అవసరమైన చర్యలను చేపట్టాం. అంతగా భయపడాల్సిన అవసరం లేదు’ అని హర్ష వర్దన్ పేర్కొన్నారు.
