వరంగల్‍ స్మార్ట్ సిటీకి..ఎలక్ట్రిక్‍ బస్సులు ఇయ్యట్లే

వరంగల్‍ స్మార్ట్ సిటీకి..ఎలక్ట్రిక్‍ బస్సులు ఇయ్యట్లే

వరంగల్‍, వెలుగు: వరంగల్‍ స్మార్ట్ సిటీ రోడ్లపై రయ్‍ రయ్‍మని తిరగాల్సిన ఎలక్ట్రిక్‍ బస్సులు రిటర్న్ వెళ్లిపోయాయి. గ్రేటర్‍ సిటీలో పొల్యూషన్‍ లేకుండా నడిపేందుకు మూడేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం 25 ఎలక్ట్రిక్‍ బస్సులు ఇవ్వడానికి ముందుకొచ్చింది. కోట్లాది రూపాయల సబ్సిడీకి ఓకే చెప్పింది. కానీ రాష్ట్ర సర్కారు స్పందించలేదు. సకాలంలో ఫార్మాలిటీస్ పూర్తి చేయకపోవడం, జిల్లాకు చెందిన మంత్రులు, గ్రేటర్‍ ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడంతో వెహికల్స్ వెనక్కు వెళ్లాయి. ఇప్పుడు రెండో దశలో హైదరాబాద్‍ సిటీలో మరో 300 ఎలక్ట్రిక్‍ బస్సులు నడిపేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. బస్సుల తయారీకి ఆర్డర్‍ కూడా ఇచ్చారు. ఐటీ మంత్రి కేటీఆర్ ఇంకో అడుగు ముందుకేసి జీహెచ్‍ఎంసీలో డబుల్ డెక్కర్‍ బస్సులు నడిపేలా చొరవ తీసుకుంటున్నారు. గ్రేటర్‍ వరంగల్‍కు గతంలోనే అన్యాయం జరిగిన నేపథ్యంలో ఈసారైన బస్సులు ఇస్తారనుకుంటే.. రాష్ట్ర సర్కారు ఏ మాత్రం పట్టించుకోలేదు. 

పొల్యూషన్​ కంట్రోల్​ కోసం..

పొల్యూషన్ కంట్రోల్‍ చేయాలనే ఉద్దేశంతో 2030 నాటికి దేశంలో 80 శాతం ఎలక్ట్రిక్‍ బస్సులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. దీనికోసం ‘ఫేం ఇండియా స్కీం’ తీసుకొచ్చింది.  పలు రాష్ట్రాలకు రెంటల్‍ సిస్టంలో వందలాది ఎలక్ట్రిక్‍ బస్సులు ఇచ్చేందుకు సిద్ధమైంది. తెలంగాణలో 2019 నాటికి 10 వేలకు పైగా డీజిల్‍ బస్సులు ఉండగా.. క్రమక్రమంగా వాటిని తగ్గించే ప్రయత్నం చేసింది. రాష్ట్రానికి 2018లో రూ.కోటి, 2019లో రూ.50 లక్షల సబ్సిడీ ఇచ్చింది. టీఎస్ ఆర్టీసీకీ మొదట 325 వెహికల్స్ ఇచ్చేందుకు ఓకే చెప్పింది. ఇందులో 300 హైదరాబాద్‍కు కేటాయించగా.. మరో 25 వరంగల్‍ సిటీకి మంజూరు చేసింది. ఎలక్ట్రిక్‍ బస్సులు ఢిల్లీ, ముంబై, అహ్నదాబాద్​వంటి రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో నడుస్తున్నాయి. కంపెనీలు 9, 12, 18  మీటర్ల  బస్సులను తయారు చేస్తుండగా.. మన ప్రాంత రోడ్లకు అనుకూలంగా 12 మీటర్ల వెహికల్స్​కు అప్పట్లో ఆఫీసర్లు ఓకే చెప్పారు.  ఈ బస్సులకు ఆటోమెటిక్‍ ట్రాన్స్​మిషన్‍ తప్పితే గేర్లు ఉండవు. 2 గంటలు చార్జింగ్‍ పెడితే.. 8 గంటలు బస్సు నడిపేందుకు వీలుంటుందని చెప్పారు. ఒక్కోదాంట్లో 30 మందికి పైగా జర్నీ చేయవచ్చన్నారు. ఈ స్కీం మొదట్లోనే గోల్డ్​స్టోన్ కంపెనీవాళ్లు హైదరాబాద్‍కు 40 ఏసీ బస్సులను కేటాయించారు. శంషాబాద్‍ ఎయిర్‍పోర్ట్ నుంచి నాలుగు రూట్లలో వీటిని నడుపుతున్నారు. 

25 బస్సులు వెనక్కు పోయినయ్‍

వరంగల్‍ సిటీకి 25 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరైన విషయాన్ని 2019 సెప్టెంబర్‍లో టీఎస్‍ ఆర్టీసీ పెద్దాఫీసర్లు కన్‍ఫర్మ్ చేశారు. సంస్థ తరఫున టెండర్ల నోటిఫికేషన్‍ ప్రక్రియ చేపట్టామని.. అది పూర్తయితే  ఓరుగల్లుకు కూడా ఎలక్ట్రిక్​బస్సులు పరిచయం చేసినట్లేనని తెలిపారు. వరంగల్‍ సిటీతో పాటు గ్రేటర్‍ వరంగల్‍ శివార్ల వరకు వీటిని తిప్పాలనే ఆలోచనతో ఉన్నామన్నారు. తీరా ఏడాదిన్నర తర్వాత వరంగల్ పర్యటనకు వచ్చిన ఆర్టీసీ కరీంనగర్‍, హైదరాబాద్ జోన్‍ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టీ.వీ.మునిశేఖర్‍ అసలు విషయం చెప్పారు. కార్మికుల సమ్మె కారణంగా ‘ఫేమ్ ఇండియా స్కీం’ గడువు ముగిసే సమయానికి టీఎస్‍ ఆర్టీసీ ఫార్మాలిటీస్ పూర్తి చేయలేకపోయిందని తెలిపారు. కాగా,  సమ్మెలో సిబ్బంది తప్పితే పెద్దాఫీసర్లు లేరు. ఇక అధికారులు చెప్పిన ఇదే సమ్మె టైంలో వరంగల్‍తో పాటు అన్ని రీజియన్ల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం వేలాది హైర్‍ బస్సులకు టెండర్ల పక్రియ నిర్వహించింది. ఇదే విషయంపై ఈడీని ప్రశ్నిస్తే.. తమ చేతిలో ఏం లేదని పేర్కొన్నారు. 

మళ్లీ హైదరాబాద్‍కే.. 

ఫేం ఇండియా 2 స్కీంలో 300 ఎలక్ట్రిక్‍ బస్సులను కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.500 కోట్లతో ఒలెక్ట్రా గ్రీన్‍టెక్‍ లిమిటెడ్‍ కు టీఎస్‍ ఆర్టీసీ ఆర్డర్‍ ఇచ్చింది. 12 ఏండ్లకు గానూ గ్రాస్‍ కాస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో బస్సులను తీసుకుంటున్నట్లు చెప్పింది. ఇవి త్వరలోనే రానున్నాయి. పుణే, ముంబై, గోవా, డెహ్రడూన్‍, అహ్మదాబాద్‍, సిల్వాసా, నాగపూర్‍లో ఇప్పటికే ఈ బస్సులు నడుస్తున్నాయి.  5 గంటల పాటు చార్జ్​చేస్తే బస్సు 200 కిలోమీటర్లు పరుగులు పెడుతుంది. సీసీ కెమెరాలు, ప్రతి సీటుకు ఎమర్జెన్సీ బటన్‍, యూఎస్‍బీ సాకెట్‍ ఉంటాయి. అలాగే.. హైదరాబాద్‍ రోడ్లపై 1990 సమయంలో నడిపిన డబుల్‍ డెక్కర్‍ బస్సులను సైతం నడిపేందుకు రాష్ట్ర సర్కారు రెడీ అయింది. డబుల్‍ డెక్కర్‍ బస్సులు నడపాలని కొందరు ఐటీ మంత్రి కేటీఆర్‍కు ట్విట్టర్‍ చేసిన నేపథ్యంలో ఆయన సూచన మేరకు టీఎస్‍ఆర్టీసీ పెద్దలు మొదట 10 డబుల్‍ డెక్కర్‍ బస్సులను నడపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.    


వరంగల్‍ స్మార్ట్ సిటీ ప్రసావన తీయట్లే

హైదరాబాద్‍ తర్వాత గ్రేటర్‍ వరంగల్‍ సిటీకి అంతే ప్రయారిటీ ఇస్తున్నామని చెబుతున్న మంత్రులు తీరా కొత్త ప్రాజెక్టులు వచ్చేసరికి దీని ప్రస్తావన తీయట్లేదు. 2019లోనే వరంగల్‍ సిటీ ఎలక్ట్రిక్‍ బస్సుల అవకాశాన్ని కోల్పోయిన విషయం రాష్ట్ర మంత్రులకు, టీఎస్‍ఆర్టీసీ పెద్దాఫీసర్లకు తెలిసినా.. కనీసం రెండో దశలో కూడా ఓరుగల్లు ప్రస్తావన తీయట్లేదు. కనీసం ఈసారైనా వరంగల్‍ సిటీకి ఎలక్ట్రిక్‍ బస్సులను మంజూరు చేయాలని జనాలు కోరుతున్నారు. మంత్రులు కేటీఆర్‍, పువ్వాడ అజయ్‍తో పాటు జిల్లాకు చెందిన మంత్రులు, సిటీ ఎమ్మెల్యేలు ఈ విషయంలో చొరవ చూపాలంటున్నారు.