ఉద్యాన పంటలకు సర్కార్ ఊతం..డ్రిప్ ఇరిగేషన్ కు అందుబాటులో రూ.3 కోట్ల నిధులు

ఉద్యాన పంటలకు  సర్కార్ ఊతం..డ్రిప్ ఇరిగేషన్ కు అందుబాటులో రూ.3 కోట్ల నిధులు

మెదక్, వెలుగు: ఉద్యానవన పంటలకు ప్రభుత్వం ఊతం ఇస్తోంది. గత బీఆర్ఎస్​ ప్రభుత్వంలో ఉద్యాన పంటలకు ఎలాంటి నిధులు మంజూరు చేయలేదు. ప్రభుత్వం నుంచి సబ్సిడీలు లేక పోవడంతో డ్రిప్, స్ర్పింక్లర్ సిస్టం ద్వారా పండ్ల, కూరగాయల తోటలు సాగు చేయాలనుకున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

ప్రస్తుత కాంగ్రెస్​ ప్రభుత్వం ఉద్యాన పంటలకు సబ్సిడీ స్కీంలను అమలు చేస్తోంది. ఈ మేరకు అందుకు అవసరమైన నిధులను మంజూరు చేసింది. దీంతో రైతులు ఉద్యానవన పంటల సాగుకు ముందుకు వస్తున్నారు. 

డ్రిప్ ఇరిగేషన్​కు..

డ్రిప్​ ఇరిగేషన్​ కు సంబంధించి జిల్లాకు  మొత్తం రూ.6.50 కోట్లు కేటాయించగా ఇప్పటి వరకు రూ.3.50 కోట్లకు సంబంధించిన పనులు మంజూరు చేశారు. ఇంకా రూ.3 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయి. డ్రిప్​ ఇరిగేషన్​ ఏర్పాటుకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ లకు 100 శాతం, సన్న, చిన్న కారు, బీసీ రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం సబ్సిడీ ఉంటుంది. 

పండ్లు, కూరగాయ తోటలు, ఆయిల్​పామ్​కు దేనికైనా డ్రిప్​ ఇరిగేషన్​ సిస్టం ఏర్పాటు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న రైతులు సంబంధిత ప్రాంత హార్టికల్చర్​ ఆఫీసర్​ను సంప్రందించి దరఖాస్తు చేసుకోవచ్చు. 

50 శాతం సబ్సిడీ

కూరగాయ తోటల సాగుకు సంబంధించి శాశ్వత పందిళ్లు (పెండాల్స్)  నిర్మాణం కోసం 50 శాతం సబ్సిడీ లభిస్తుంది. ఎకరాకు యూనిట్​ కాస్ట్​ రూ.2 లక్షలు అయితే అందులో 50  శాతం రూ.1 లక్ష సబ్సిడీ ఉంటుంది. ఎంత మంది రైతులు ముందుకు వచ్చినా పెండాల్స్​ మంజూరు చేసే అవకాశం ఉంది. 

ఫామ్​ మెకనైజేషన్​..

ఫామ్ మెకనైజేషన్​కింద 50 శాతం సబ్సిడీపై బ్రష్ కటర్లు, తైవాన్ స్ప్రేయర్లు, పవర్ వీడర్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం ఆమోదించిన కంపెనీలకు సంబంధించిన యంత్రాలకు మాత్రమే సబ్సిడీ స్కీమ్​ వర్తిస్తుంది. ఆయా యంత్రాలు అవసరం అయిన రైతులు సంబంధింత హార్టికల్చర్​ ఎక్స్​ టెన్షన్​ ఆఫీసర్​ (హెచ్​ఈఓ)ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. ఫామ్ పండ్స్ నిర్మాణాలకు సైతం 50 శాతం సబ్సిడీ ఉంటుంది. 

21 మీటర్ల పొడవు, 21 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల లోతుతో ఫామ్​ పండ్స్​ నిర్మించుకోవాలి. నిర్ణీత సైజ్​లో ఫామ్​ పండ్స్ తవ్వాక అందులో హెచ్​డీపీవీ షీట్​ ఏర్పాటు చేసుకోవాలి. ఫామ్​ పండ్​ యూనిట్​ కాస్ట్​ రూ.1.50 లక్షలు కాగా అందులో 50 శాతం రూ.75 వేలు సబ్సిడీ ఉంటుంది. పండ్ల తోటల పెంపకానికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. కొత్తగా మామిడి, జామ, నిమ్మ, అవకాడో, డ్రాగన్ ఫ్రూట్ తోటల పెంపకానికి సబ్సిడీ వర్తిస్తుంది. 

ఆయిల్​పామ్​ తోటలకు

ఆయిల్​పామ్​ తోటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. జిల్లాలో 2,500 ఎకరాల్లో ఆయిల్​ పామ్​తోటలు సాగుచేయాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు 674 ఎకరాల్లో సాగు చేశారు. మరో 450 ఎకరాల్లో అయిల్​పామ్ తోటల సాగుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. చిన్నశంకరంపేట, వెల్దుర్తి, శివ్వంపేట మండలాల్లో మెగా ప్లాంటేషన్​ ఏర్పాటు చేశారు. 

ఎకరాకు నాలుగేళ్ల వరకు రూ.50 వేల సబ్సిడీ లభిస్తుంది. నిజాంపేటలో 43 ఎకరాల్లో ఆయిల్​పామ్​ నర్సరీ ఏర్పాటు చేశారు. జిల్లాలో ఆయిల్​పామ్​ తోటలు సాగు చేసే రైతులకు అవసరమైన మొక్కలను అక్కడి నుంచే సరఫరా చేస్తున్నారు.