సర్కారు బిల్డింగ్‌నే అమ్మేశారు

సర్కారు బిల్డింగ్‌నే అమ్మేశారు
  • రూ. 5లక్షలకు  మహిళా సంఘం భవనం అమ్మకం 
  • సర్పంచ్​తండ్రి, ఉప సర్పంచ్​భర్త , మహిళా సంఘం లీడర్లు కలిసి స్కెచ్​ 
  • ఆఫీసర్లకు తెలిసీ పట్టించుకో లేదంటున్న స్థానికులు

మక్తల్​, వెలుగు; గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు ఒక్కటై  గవర్నమెంట్​ బిల్డింగ్​నే వేలం వేసి అమ్మేశారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్​ మండలం ఎర్గాట్​పల్లిలో జరిగిన ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎర్గాట్​పల్లి గ్రామంలో 20 ఏండ్ల కింద మహిళ సమాఖ్య భవనాన్ని నిర్మించారు.మహిళ సమతా సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ ఊట్కూరు మండలంలో మహిళలను ఆర్ధికంగా బలపడేలా చేయాలని  పొదుపు సంఘాలను ప్రారంభించింది.ఏర్గాట్​పల్లిలో 34 మంది మెంబర్స్​ కలిసి పార్వతి మహిళ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘం కోసం 200 గజాల స్థలంలో 2002లో  బిల్డింగ్​ను నిర్మించారు.  దీంతోపాటు  కొల్లూరు, ఊట్కూర్ , పెద్దపొర్ల, తిప్రాస్​పల్లి, పులిమామిడి గ్రామాల్లో మహిళ సమాఖ్య భవనాలను నిర్మించింది.  ఒక్కో బిల్డింగ్​ కోసం ప్రభుత్వం అప్పట్లో రూ. 40 వేలు కేటాయించింది. 5ఏండ్ల కింద మహిళ సమత సోసైటీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అప్పటి నుంచి ఈ బిల్డింగ్​లో ఐకేపీ సిబ్బంది సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే.. గ్రామ సర్పంచ్ తండ్రి​, ఉప సర్పంచ్​భర్త, గ్రామ పెద్దలు కలిసి మహిళా సంఘ సభ్యులతో మాట్లాడారు. ఈ భవనం మహిళ సంఘానికి సొంతమని.. దీన్ని అమ్మి  డబ్బులను పంచుకుందామని ఒప్పించారు. వారం రోజుల క్రితం  సంఘం  సభ్యులు, సర్పంచ్ తండ్రి బాలకిష్టయ్య, ఉప సర్పంచ్​భర్త కలిసి ఊళ్లో బిల్డింగ్​ను వేలం వేశారు. శంకరమ్మ అనే మహిళాసంఘం మెంబర్​ రూ 5 లక్షలకు బిల్డింగ్​ను కొనుక్కుంది. వచ్చిన డబ్బులను వీరు గుట్టుచప్పుడు కాకుండా మెంబర్స్​కు  పంచారు. ఈ సంగతి ఆఫీసర్లకు తెలిసినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ బిల్డింగ్​ను అమ్మడం సరైంది కాదని, ఈ విషయాన్ని జిల్లా ఆఫీసర్లకు కంప్లైంట్​ చేస్తానని ఐకేపీ ఏపీఎం నర్సిములు చెప్పారు.