మరో 48 గంటలు వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలె : సీఎస్‌ శాంతికుమారి

మరో 48 గంటలు వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలె : సీఎస్‌ శాంతికుమారి

తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి అత్యవసర సమావేశం నిర్వహించారు. రానున్న 48 గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. అన్నిశాఖల అధికారులతో పాటు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. వరంగల్‌, ములుగు, కొత్తగూడెంలో ఎన్‌డీఆర్‌ఎప్‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు.

హైదరాబాద్ లోనూ 40 మంది సిబ్బందితో ఒక బృందం సిద్ధంగా ఉందన్నారు సీఎస్ శాంతికుమారి. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల్లోనూ 50 శాతం నీటి నిల్వలు ఉన్నందున..భారీ వరదలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో ఉన్న అన్ని మంచినీటి ట్యాంకుల్లో క్లోరినేషన్ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పోలీసు, నీటిపారుదల, పంచాయతీరాజ్‌, విద్యుత్‌, అర్‌ అండ్‌ బీ శాఖలు సమన్వయంతో కలిసి పని చేయాలని కోరారు. నీటిపారుదల శాఖ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వరద పరిస్థితిపైనా సంబంధిత చీఫ్ ఇంజనీర్ తోనూ సమీక్ష నిర్వహించారు.