- మిల్లింగ్ బకాయిల విడుదలకు సర్కారు గ్రీన్ సిగ్నల్
- సకాలంలో బియ్యం ఇచ్చిన మిల్లర్లకే చెల్లింపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని రైస్ మిల్లర్లకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ తీపి కబురు అందించింది. గత ఐదేండ్లుగా పెండింగ్‌లో ఉన్న కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిలను వెంటనే విడుదల చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో సుమారు రూ. 600 కోట్ల మిల్లింగ్ ఛార్జీలు మిల్లర్ల ఖాతాల్లో చేరనున్నాయి.2019–20, 2023–24 సీజన్లకు సంబంధించి ఎఫ్‌సీఐ నుంచి అందిన నిధులను మిల్లర్లకు పంపిణీ చేయాలని కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చెల్లింపుల్లో అధికారులు కఠిన నిబంధనలు విధించారు. ఎవరైతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం సకాలంలో బియ్యాన్ని అప్పగించారో (నాన్ డిఫాల్టర్స్) వారికి మాత్రమే ఈ ప్రయోజనం చేకూరుతుంది. ఎగవేతదారులుగా ఉన్న మిల్లర్లకు లేదా వారికి గ్యారెంటర్ (పూచీకత్తు)గా ఉన్న వారికి బకాయిలను చెల్లించకూడదని నిర్ణయించారు.
మిల్లర్లు సమర్పించే రికార్డులు, పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిధులు విడుదల చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఏ సీజన్‌లోనూ డిఫాల్టర్ కాలేదని, ఎగవేతదారులకు పూచీకత్తు ఇవ్వలేదని మిల్లర్లు ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ అదనంగా చెల్లింపులు జరిగినట్లు తేలితే, భవిష్యత్తులో వాటిని తిరిగి వసూలు చేసుకునేలా మిల్లర్ల నుంచి అఫిడవిట్ తీసుకోనున్నారు. వచ్చే 2025~26 సీజన్‌లో రైస్ మిల్లింగ్ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగాలంటే, మిల్లర్లకు ఉన్న ఆర్థిక ఇబ్బందులను తొలగించడం అత్యవసరమని ప్రభుత్వం భావిస్తున్నది. పెండింగ్ బకాయిల విడుదలతో మిల్లింగ్ కార్యకలాపాలు ఊపందుకుంటాయని అధికారులు ఆశిస్తున్నారు.

