రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీ వర్గాలకు రాజకీయంగా నిర్ణాయక పదవుల్లో సరైన వాటా దక్కడం లేదని, ఇందులో వీరి వాటా కేవలం 3 శాతం మాత్రమే ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అగ్రవర్ణాల(ఓసీ) ఆధిపత్యం ఉండగా, అట్టడుగు వర్గాల ప్రాతినిధ్యం నామమాత్రంగా మిగిలింది. ప్రభుత్వ విధానాలను రూపొందించే ఉన్నత స్థాయి రాజకీయ పదవుల్లో కొన్ని సామాజిక వర్గాల వారే దశాబ్దాలుగా పాతుకుపోయినట్లు గణాంకాలు చెప్తున్నాయి. 2024లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను విశ్లేషించిన నిపుణుల బృందం తన నివేదికలో ఇలాంటి పలు ఆసక్తికర అంశాలు వెల్లడించాయి.
పాలక వర్గాల్లో అట్టడుగు వర్గాల భాగస్వామ్యం పెరిగినప్పుడే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తుందని కమిటీ అభిప్రాయపడింది. ఆర్థిక స్థోమతకు రాజకీయ ప్రాతినిధ్యానికి మధ్య ఉన్న బలమైన సంబంధాన్ని ఈ నివేదిక బయటపెట్టింది. బీసీ సామాజిక వర్గాల్లోనూ కొన్ని ఎగువ కులాలే అధికారాన్ని అనుభవిస్తుండగా, అత్యంత వెనుకబడిన వర్గాలకు(ఎంబీసీ) ప్రాతినిధ్యం లేకుండా పోయింది.
సమగ్ర సర్వే డేటా ప్రకారం బీసీల్లో ఉన్న 133 పైచిలుకు కులాల్లో కేవలం వేళ్లమీద లెక్కించదగ్గ కులాలకే రాజకీయ గుర్తింపు లభిస్తోంది. చట్టసభల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల ఆ వర్గాల సమస్యలు పరిష్కారం కావడం లేదని నివేదిక అభిప్రాయపడింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూనే, అది రాష్ట్ర స్థాయి పదవులకు విస్తరించడం లేదని వెల్లడించింది. ‘బీసీ నాయకత్వం క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నా, అది ఉన్నత రాజకీయ నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరకుండా అడ్డంకులు ఎదురవుతున్నాయి.
►ALSO READ | సమ్మె విరమించుకున్న విద్యుత్ శాఖ ఉద్యోగులు...డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు..
ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉండడం వల్లే బీసీ నేతలు రాజకీయాల్లో రాణించలేకపోతున్నారు. రాజకీయ అధికారం బదిలీ కావాలంటే బీసీ సామాజిక వర్గాల్లోని అన్ని కులాలకు సమాన ప్రాతినిధ్యం దక్కాలి’ అని కమిటీ స్పష్టం చేసింది. చిన్న కులాలకు రాజకీయ ఉనికి కల్పించడంలో రాజకీయ పార్టీలు విఫలమవుతున్నాయని కుండబద్ధలు కొట్టింది.
వలస కార్మికులు, పేదలకు చోటేది?
పట్టణ ప్రాంతాల్లో రాజకీయ నాయకత్వం కేవలం అగ్రవర్ణాలు, కొన్ని ఎగువ బీసీ కులాల చేతుల్లోనే ఉన్నట్లు గణాంకాలు తేల్చాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి వంటి జిల్లాల్లో రాజకీయ నిర్ణాయక శక్తిగా వృత్తిపరమైన తరగతులు, ఓసీలే ఉన్నారని బయటపడింది. నగరాల్లో విద్యావంతులు, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న సామాజిక వర్గాలు రాజకీయ పార్టీల నాయకత్వ బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు.
అదే సమయంలో పట్టణాల్లో నివసించే వలస కార్మికులు, అద్దె ఇళ్లలో ఉండే అట్టడుగు వర్గాల రాజకీయ భాగస్వామ్యం అత్యంత తక్కువగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి. రాజకీయ పార్టీల కమిటీల్లోనూ, పట్టణ స్థానిక సంస్థల్లోనూ ఓసీ సామాజిక వర్గాలకు వారి జనాభా కంటే ఎక్కువ ప్రాతినిధ్యం దక్కుతోందని ఈ నివేదికతో స్పష్టమైంది. ఆర్థిక బలమే పట్టణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుండటంతో, పేద వర్గాలకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీలు పోటీలో వెనుకబడిపోతున్నట్లు తేలింది.

