V6 News

Pallichattambi Review: టొవినో థామస్ పిరియాడిక్ యాక్షన్ డ్రామా.. ఎలా ఉందంటే..?

Pallichattambi Review: టొవినో థామస్ పిరియాడిక్ యాక్షన్ డ్రామా.. ఎలా ఉందంటే..?

మిన్నల్ మురళి, 2018 లాంటి చిత్రాలతో మలయాళ హీరో టొవినో థామస్ తెలుగులోనూ మంచి గుర్తింపును అందుకున్నాడు. అతను హీరోగా నటించిన చిత్రం ‘పళ్లి చట్టంబి’ (Pallichattambi). కేరళలో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా డిజో జోస్ ఆంటోని ఈ పిరియాడిక్ యాక్షన్ డ్రామాను తెరకెక్కించారు.

తెలుగు నిర్మాతలైన చాణక్య, చైతన్య, చరణ్.. నౌఫల్‌, బ్రిజీష్‌తో కలిసి మలయాళంలో నిర్మించారు. రెండు రోజుల క్రితం మలయాళంలో విడుదలై శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. 

కథగా.. 

కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ మొదటా పరిపాలనలోకి వచ్చిన 1957 నేపథ్యంలో జరిగే కథ ఇది. ఈ తర్వాతి ఏడాది భూసేకరణ చట్టం అమలులోకి తీసుకురావడంతో భూస్వాములు, మత పెద్దల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. కమ్యూనిస్టుల నుంచి చర్చిల భూములను కాపాడుకునేందుకు మత పెద్దలు ‘పళ్లి చట్టంబి’ (చర్చి రౌడీ) అనబడే రక్షకుడిని నియమించుకుని, అతని ద్వారా ఓ రక్షణ దళాన్ని ఏర్పాటు చేసుకుంటుంటారు. అలా కణియార్‌‌ అనే గ్రామంలోని కున్నంపురం చర్చి రక్షణకు పోతన్ క్రిష్టోఫర్‌ (టొవినో థామస్‌) ‌ను తీసుకొస్తారు. నిజానికి అతను క్రిష్ణ పిళ్లై అనబడే హిందువు. ఊర్లోకి వచ్చి రావడంతోనే తన కండబలంతో ఆక్రమించబడిన చర్చి భూమిని రక్షించి అక్కడి వారికి దగ్గరవుతాడు.

►ALSO READ | మగాడు చెప్పుకోలేని సమస్య: పెళ్ళైన మూడో రోజే వెళ్ళిపోయిన భార్య.. ‘పాపం ప్రతాప్’ అసలు స్టోరీ ఇదే

అయితే కమ్యూనిస్టుల నాటకాలను అడ్డుకునే క్రమంలో ఆ పార్టీకి చెందిన రెబెక్కా (కయాదు లోహర్‌‌)తో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో అతను క్రిస్టియన్ కాదని తెలిసి చర్చి నుంచి వెళ్లగొడతారు. మరోవైపు ఓ అదృశ్య హస్తం ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలో భాగంగా కేరళలో అల్లర్లు సృష్టిస్తుంది. ఇందుకు కరడుగట్టిన పోలీస్ ఆఫీసర్‌‌ రైరు రామన్న (శత్రు) రంగంలోకి దిగుతాడు. అతని ప్రధాన లక్ష్యం పోలీసు బలగాలతో కణియార్ గ్రామాన్ని నాశనం చేయడం. ఆ ముప్పు నుంచి గ్రామాన్ని కృష్ణ పిల్లై ఎలా కాపాడాడు.. ఆ ప్రాంత దొర పటేలర్‌‌ కుంజంబు నంబియార్‌‌ (పృథ్విరాజ్ సుకుమారన్‌)కు ఈ ఇష్యూతో ఉన్న లింక్ ఏమిటి అనేది ప్రధాన కథ. 

ఎలా ఉందంటే.. 

1930లో తోమాపురం ఫారెస్ట్‌లో పటేలర్‌‌ కుంజంబు నంబియార్‌‌ చేసే ఊచకోతతో కథను ఆరంభించి సినిమాపై ఆసక్తిని పెంచిన దర్శకుడు... ఆ తర్వాత 1958లో కమ్యూనిస్టులు వర్సెస్ చర్చి పెద్దల ఇష్యూతో కథలోకి వెళ్లాడు. కృష్ణ పిళ్లైగా హీరో పరిచయం, అతను పరిస్థితుల్లో పోతన్ క్రిష్టోఫర్ అయ్యాడు, గ్రామంలోని అధికార పార్టీ వాళ్లను ఎదురించడం లాంటి సన్నివేశాలన్నీ ఎంటర్‌‌టైనింగ్‌గా సాగాయి. రెబెక్కాతో ప్రేమలో పడే సన్నివేశాలు కాస్త కథలో వేగాన్ని నెమ్మదించినా ఇద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఇంప్రెస్‌ చేస్తుంది. చర్చి పెద్దలకు అతను క్రిస్టియన్ కాదనే విషయం తెలియడంతో కథలో వేగం పుంజుకుంటుంది. రైరు రామన్నగా శత్రు పాత్రకు ఇచ్చిన ఎలివేషన్స్‌ ఆకట్టుకుంటాయి. ఆపై సెకెండాఫ్లో వచ్చే సీన్స్‌ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి.

ముఖ్యంగా పృథ్విరాజ్ సుకుమారన్ పోషించిన కుంజంబు నంబియార్‌‌ క్యారెక్టర్‌‌ను ప్రజెంట్ చేసిన తీరు ఇంప్రెస్ చేస్తుంది. ఈ కుట్ర వెనకున్నది అతనే అని తెలవడం, అతనికి కృష్ణ పిళ్లైకి ఉన్న పాత విరోదం లాంటి అంశాలు ఆసక్తి రేపుతాయి. రేరు రామన్న పోలీస్ దళంతో గ్రామంపై చేసే దాడి, ఊరి వాళ్లతో కలిసి కృష్ణ పిళ్లై దాన్ని తిప్పికొట్టడం విజువల్‌గా మెప్పించాయి. క్లైమాక్స్‌లో మెయిన్ విలన్ అయిన పృథ్విరాజ్‌ను టొవినో ఢీ కొట్టే సీన్‌తో తర్వాతి భాగానికి లీడ్ ఇచ్చారు. ప్రధానంగా ఇది కేరళలో భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల నేపథ్యంలో సాగే కథ.

►ALSO READ | ఒకప్పుడు యూట్యూబర్తో రిలేషన్.. ప్రస్తుతం IPL ఆటగాడితో ప్రేమాయణం.. ఎవరీ సమ్రీన్ కౌర్?

ఈ నేపథ్యంలో అప్పటి సామాజిక, రాజకీయ పరిస్థితులను చూపిస్తూ ఓ యాక్షన్ డ్రామా తీయాలనుకున్నాడు దర్శకుడు డిజో జోస్ ఆంటోని. 1950ల నాటి కేరళ రాజకీయ పరిస్థితుల గురించి, భూసేకరణ చట్టం గురించి, దాన్ని కొందరు ఎందుకు వ్యతిరేకించారు అనే అంశాల గురించి ఇప్పటి ప్రేక్షకులకు అర్థమయ్యేలా వివరణ ఇచ్చి ఉంటే.. ఈ కథకు ప్రేక్షకులు త్వరగా కనెక్ట్ అయ్యేవారు. అయితే దర్శకుడు దానిపై ఎక్కువగా దృష్టి సారించలేదు. అదీకాక కేరళలోని ప్రాంతాలు, వ్యక్తుల పేర్లు తెలుగు ప్రేక్షకులకు కొంత గందరగోళంగా అనిపిస్తాయి.  

ఎవరెలా నటించారంటే..

మరోసారి తనదైన నటనతో టొవినో థామస్ మెప్పించాడు. మాస్‌ లుక్‌లో యాక్షన్‌ సీన్స్‌లో అదరగొట్టిన టొవినో.. ఎమోషనల్ సీన్స్‌లోనూ పరిణితి చూపించాడు. తన నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. కయాదు లోహర్ సినిమాలో కనిపించింది కొద్దిసేపు అయినా ఆకట్టుకుంది. పృథ్విరాజ్ పోషించిన క్యారెక్టర్ ఈ సినిమాకు మేజర్ హైలైట్.

ప్రమోషన్స్‌లో ఈ పాత్రను దాచి సినిమాలో సర్‌‌ప్రైజ్ చేశారు. పాత్ర నిడివి తక్కువైనా ‘విక్రమ్‌’లో సూర్య పోషించిన రోలెక్స్‌ పాత్ర తరహాలో ఇంప్రెస్ చేస్తుంది. కరడుగట్టిన పోలీస్ ఆఫీసర్‌‌గా శత్రుకు చక్కని పాత్ర లభించింది. సిద్ధిఖీ, విజయ రాఘవన్, బాబు రాజ్, ఆడుకాలం నరేన్ ఇతర పాత్రల్లో కనిపించారు. 

సాంకేతికంగా..

దర్శకుడు ఎంచుకున్న కథ పాతదే అయినా దాన్ని తెరపై చూపించిన విధానం కొత్తగా అనిపిస్తుంది. క్యారెక్టర్స్‌ మధ్య ఉన్న సంఘర్షను బాగా ఎలివేట్ చేశాడు. అసలు కథలోకి వెళ్లడానికి దర్శకుడు కొంత ఎక్కువ సమయం తీసుకున్నాడు. అలాగే కొంతవరకు ఊహించగలిగేలా ఉండటం కూడా ఉత్కంఠను తగ్గించింది.

జేక్స్‌ బిజాయ్ ఇచ్చిన పాటలతో పాటు సినిమాలోని మూడ్‌కు తగ్గట్టుగా సంగీతం కుదిరింది. 1950 బ్యాక్‌డ్రాప్‌ను రీ క్రియేట్ చేయడంలో ఆర్ట్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్‌‌ల బ్రిలియంట్ వర్క్‌ తెరపై కనిపించింది. సహజత్వానికి దగ్గరగా తీసిన యాక్షన్ సీక్వెన్స్‌లు ఆకట్టుకున్నాయి.

ఫైనల్‌గా.. 

మలయాళ సినిమాల్లో ఉండే సహజత్వాన్ని ఇష్టపడేవారికి, యాక్షన్‌ సీన్స్‌ను ఎంజాయ్ చేసే వాళ్లకు, టొవినో థామస్ మార్క్ నటనను ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే ఒక మంచి కంటెంట్ ఓరియంటెడ్‌ యాక్షన్‌ సినిమా చూసిన ఫీల్‌ను ఇస్తుంది.