V6 News

మగాడు చెప్పుకోలేని సమస్య: పెళ్ళైన మూడో రోజే వెళ్ళిపోయిన భార్య.. ‘పాపం ప్రతాప్’ అసలు స్టోరీ ఇదే

మగాడు చెప్పుకోలేని సమస్య: పెళ్ళైన మూడో రోజే వెళ్ళిపోయిన భార్య.. ‘పాపం ప్రతాప్’ అసలు స్టోరీ ఇదే

టాలీవుడ్లో తనదైన ముద్ర వేసుకుంటూ, వైవిధ్యమైన పాత్రల ఎంపికతో దూసుకుపోతున్నారు నటుడు తిరువీర్ (Thiruveer). మంచి కంటెంట్ ఉన్న సినిమాలతోనే వస్తాడనే సిగ్నేచర్ సంపాదించుకున్నాడు. ఇటీవలే, ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’తో హిట్ అందుకున్న తిరువీర్.. ఇపుడు ‘పాపం ప్రతాప్‌‌’ అనే మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్తో వచ్చాడు.

ఎస్పీ దుర్గా నరేష్‌‌ దర్శకత్వం వహించిన ‘పాపం ప్రతాప్‌‌’ శుక్రవారం (ఏప్రిల్ 17, 2026న) ప్రేక్షకుల ముందుకొచ్చింది. పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌‌. అజయ్ ఘోష్, ప్రసాద్ బెహరా కీలక పాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాడు తిరువీర్. ఈ క్రమంలో థియేటర్లోకి వచ్చిన ‘పాపం ప్రతాప్‌‌’ ఎలా ఉంది? ఆడియన్స్ను మెప్పించిందా? లేదా? అనేది రివ్యూలో చూసేద్దాం.. 

కథేంటంటే:

ప్రతాప్‌ (తిరువీర్‌)కి చిన్నప్పటి నుంచే బుజ్జమ్మ (పాయల్ రాధాకృష్ణ)పై ప్రేమ ఉంటుంది. పెద్దలను ఒప్పించి ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. అయితే పెళ్లి అయిన మూడు రోజులకే బుజ్జమ్మ పంచాయితీ పెట్టి, భర్తతో సంసారం చేయలేనని చెబుతూ పుట్టింటికి వెళ్లిపోతుంది.

అయితే సమస్య ఏమిటో మాత్రం ఎవరికీ చెప్పదు. తనలో ఉన్న సమస్యను తానే గుర్తించి సరిదిద్దుకుంటేనే తిరిగి వస్తానని ప్రతాప్‌కు షరతు పెడుతుంది. దీంతో ఊరిలో ప్రతాప్‌పై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుకుంటారు. ఇక తనలో ఉన్న సమస్య ఏమిటో తెలుసుకునేందుకు ప్రతాప్ చాలా ప్రయత్నిస్తాడు.

ఇంతకీ ప్రతాప్‌లో ఉన్న సమస్య ఏంటీ? చివరకు ఆ సమస్య ఏంటో తెసులుసుకుని, సరిచేసుకున్నాడా? పెళ్ళైన ఆ మొద‌టి మూడు రాత్రుల్లో ఏం జరిగింది? చివరికి బుజ్జమ్మతో మళ్లీ కలిశాడా? అన్నదే మిగతా కథ. 

విశ్లేషణ:

తిరువీర్‌‌ మంచి కంటెంట్ స్టోరీలనే కాదు, చాలా చిన్న లైన్తో ఆకట్టుకునే కథలను సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇది కూడా చాలా చిన్న కాన్సెప్ట్‌తో నడిచే కథ. కానీ భావోద్వేగంగా, సున్నితమైన అంశాన్ని టచ్ చేస్తుంది. ముఖ్యంగా బయటకు చెప్పుకోలేని సమస్యలతో బాధపడే పురుషుల మనస్తత్వాన్ని ఈ సినిమా చూపించడానికి ప్రయత్నిస్తుంది. 

బుజ్జమ్మ వెళ్లిపోయిన తర్వాత, ఊరిలో ప్రతాప్ గురించి వచ్చే పుకార్లు, అతను ఎదుర్కొనే అవమానాలు.. ఇవన్నీ కథను ఆసక్తికరంగా ముందుకు నడిపించాయి. మొత్తానికి ఊళ్ళో వాళ్ళచేత “పాపం ప్రతాప్”గా మారిన హీరో, చివరికి “వీర ప్రతాప్”గా ఎలా మారాడు అన్నది సినిమాకు మెయిన్ హైలైట్. దర్శకుడు దుర్గా నరేష్ పల్లెటూరి వాతావరణాన్ని బాగా చూపించాడు. ఫ్యామిలీ ఎమోషన్స్‌ను ఎంటర్టైనింగ్‌గా మలచడంలో సక్సెస్ అయ్యాడు.

అయితే, ఫస్టాఫ్‌తో పోలిస్తే, సెకండాఫ్‌లో కథనం కొంత నెమ్మదిగా సాగడం, కొన్ని చోట్ల కామెడీ పూర్తిగా వర్క్ కాకపోవడం మైనస్. అయినప్పటికీ హీరో తిరువీర్ తన పెర్ఫార్మెన్స్‌తో ఆ లోటును కొంతవరకు కవర్ చేశాడు. ఓవరాల్గా “పాపం ప్రతాప్” ఒక సింపుల్ సెన్సిటివ్ స్టోరీ. ఊళ్ళో పంచాయితీ నేపథ్యంలో.. ఊరి జ‌నాల‌కీ, హీరో హీరోయిన్ల మ‌ధ్య వచ్చే సీన్స్ అలరిస్తాయి. సమ‌స్య‌కు మూలాల గురించి చెప్పే ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ ఆసక్తి కలిగిస్తాయి. 

నటి నటులు:

అమాయకత్వంతో ఉండే ప్ర‌తాప్ పాత్ర‌కు తిరువీర్ న్యాయం చేశాడు. నవ్వించడంతో పాటు ఎమోషనల్ సీన్స్‌లో మెప్పించాడు. హీరోయిన్ పాయ‌ల్ రాధాకృష్ణ సహజమైన నటనను కనబరిచింది. హీరో తండ్రిగా అజ‌య్ ఘోష్ ఎదుటి వ్య‌క్తుల‌పై కోప్పడే వాడిగా నటించి ఇంప్రెస్ చేశాడు. ఒకప్పటి హీరోయిన్‌ రాశి క్లైమాక్స్‌లో వచ్చే సీన్ సస్పెన్స్ కలిగిస్తుంది. యాక్టర్ ప్రసాద్ బెహరా ఒకే. 

టెక్నీకల్..

ఆనంద్, గోదావరి, చందమామ లాంటి చిత్రాలకు సంగీతం అందించిన కేఎమ్‌‌ రాధా కృష్ణ మెప్పిస్తారు. సందర్భానుసారంగా వచ్చే మెలోడీ సాంగ్స్ ఆకట్టుకుంటాయి. సురేష్ బొబ్బిలి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు సెట్ అయింది. సున్నితమైన అంశాన్ని, విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దడంలో డైరెక్టర్ నరేష్ సక్సెస్ అయ్యాడు.