V6 News

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్కు లంకె ఎందుకు?

మహిళా  రిజర్వేషన్,  డీలిమిటేషన్కు  లంకె ఎందుకు?

కేంద్రం ప్రతిపాదించిన ‘నియోజకవర్గాల పునర్విభజన’తో  మహిళా రిజర్వేషన్  కలిపితే ‘ఒక దుష్ట సమాసం’ ఏర్పడి  కొత్త ‘రాజకీయ ఉద్రిక్తత’ తలెత్తుతున్నది.  ఏ రాష్ట్రమూ నష్టపోదు అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తున్నప్పటికీ.. దీనివల్ల తమ  రాజకీయ గొంతు నొక్కివేస్తారా  అని,  ప్రతిపక్షం ప్రజా‘వాణి’  క్షీణించే  ప్రమాదం ఉందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  

ఎన్డీఏ  అధికారంలో ఉన్న రాష్ట్రాలకు  ప్రతిపాదిత  డీలిమిటేషన్‌‌‌‌‌‌‌‌ భారీగా లబ్ధి చేకూర్చడమేగాక  ప్రతిపక్ష పాలిత దక్షిణాది  రాష్ట్రాలుతీవ్రంగా  నష్టపోతాయని  చెప్పడానికి  ప్రతిపాదిత  అంచనాలే  తేల్చేస్తున్నాయి.  చర్చ లేకుండా,  సంప్రదింపులు  లేకుండా,  సమావేశాల్లో లోతుగా  మాట్లాడుకోకుండా  బిల్లులు ఆమోదమయ్యాయని  ప్రకటించుకునే  ‘పథకం’ కనపడుతున్నది.  2026 ఏప్రిల్ 16–18 తేదీల్లో  జరుగుతున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం, మూడు కీలక బిల్లుల ద్వారా దేశ రాజకీయ నిర్మాణాన్ని సమూలంగా మార్చే  ప్రయత్నాలు దాదాపు  ముగించినట్టే. 

రాజ్యాంగ (131వ సవరణ) పునర్విభజన బిల్లుపై పార్లమెంటులో జరిగే చర్చలో కొన్ని సానుకూలమైన మార్పులు వస్తాయనీ, అందువల్ల భయపడవలసినదేమీ లేదని హామీ రావడం కొంతవరకు ఊరట ఉంటుందని ఆశిస్తున్నారు. లోక్‌‌‌‌‌‌‌‌సభ మొత్తం సభ్యుల సంఖ్య 50% పెరుగుతుందనేది ప్రధానమైన అంశం. ఈ అదనపు సీట్లను ప్రస్తుతం ఉన్న నిష్పత్తిలోనే  రాష్ట్రాలకు పంచుతామంటున్నారు. 

అంటే ప్రతి రాష్ట్రం నుంచి లోక్‌‌‌‌‌‌‌‌సభ సీట్ల సంఖ్య 50% పెరుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్​షా హామీ ఇచ్చారు. అన్ని రాష్ట్రాల లోక్‌‌‌‌‌‌‌‌సభ సీట్ల సంఖ్య 50% పెరుగుతుందన్న ప్రభుత్వ హామీలో ఎలాంటి మార్పు లేదు. ఉదాహరణకు తమిళనాడులో 39 సీట్లు ఉంటే అవి 58 అవుతాయి.  కేరళలో 20 ఉంటే అవి 30 అవుతాయని అంటున్నారు.  ఇది ఎలా సాధ్యమవుతుందో  పార్లమెంటులో వివరించే వరకు  వేచి చూడాలి.

  • తీవ్ర అసమానతలకు ఆస్కారం..
  • హిందీ రాష్ట్రాలకు లాభాలు

2011 జనాభా గణన, అంటే 15 సంవత్సరాల లెక్కల ఆధారంగా 850 స్థానాల సభలో  జనాభా  ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరిగితే   ప్రాంతాలవారీగా తీవ్రమైన అసమానతలు ఏర్పడతాయనే ఆందోళనలు పెరిగిపోతున్నాయి.   ప్రస్తుతం 543 సీట్లలో 207 స్థానాలు ఉన్న హిందీ రాష్ట్రాలు (ఉత్తరప్రదేశ్,  బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా,  చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ) ఏకంగా  366  స్థానాలను పొందుతాయి.  ఇది 77% పెరుగుదల,  పార్లమెంటులో వారి వాటా 38.1% నుంచి 43.1%కి  పెరుగుతుంది.   

దక్షిణాది  రాష్ట్రాలు  తమిళనాడు,  కర్నాటక, ఆంధ్రప్రదేశ్,  తెలంగాణ, కేరళ, పుదుచ్చేరిలో  ప్రస్తుతం 132 స్థానాలు కలిగి ఉండగా అవి కేవలం 176 స్థానాలను  మాత్రమే  పొందుతాయి.  ఇది 33% పెరుగుదల మాత్రమే.   అయితే,  వారి వాటా 24.3%  నుంచి 20.7%కి  తగ్గుతుంది.  తూర్పు రాష్ట్రాల  వాటా 14.4% నుంచి 13.7%కి,  ఈశాన్య రాష్ట్రాల వాటా 4.4% నుంచి 3.8%కి తగ్గుతుంది. 

  • ప్రజాస్వామ్య అధికారాన్ని కోల్పోవడం మంచిదా?

పశ్చిమ,  హిందీయేతర ఉత్తర రాష్ట్రాల్లో పెద్దగా మార్పు ఉండదు.  దశాబ్దాలుగా  ఆరోగ్య  మౌలిక సదుపాయాలు,  విద్య,  మహిళా సాధికారతపై  దృష్టిపెట్టి సంతానోత్పత్తిని తగ్గించుకున్న రాష్ట్రాలు ఇప్పుడు తమ ప్రజాస్వామ్య అధికారాన్ని  కోల్పోతున్నాయి.  మరోవైపు ఈ  సూచికల్లో  వెనుకబడిన రాష్ట్రాలు ఎక్కువ సీట్లు  పొందుతున్నాయి. ఇదివరకే  బలహీనపడిన ఆర్థిక సమాఖ్య వ్యవస్థకు తోడు,  సామాజిక, - ఆర్థికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు రాజకీయ  ప్రాతినిధ్యం తగ్గడం మరింత నష్టం కలిగిస్తుంది.  

డీలిమిటేషన్ కింద అంతా సవ్యంగానే ఉంటాయని ప్రభుత్వం అంటున్నది.  అయినా ఇందులో  నిగూఢమైన, లోతైన అంశాలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) తర్వాత అన్ని రాష్ట్రాల  లోక్‌‌‌‌‌‌‌‌సభ సీట్ల  సంఖ్య సగం మేర పెరుగుతుందని,  పార్లమెంటులో ఏ రాష్ట్రం కూడా తన ప్రస్తుత ప్రాతినిధ్య బలాన్ని కోల్పోదని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి చెప్పారని  మీడియోతో  చెప్పారు.

  2023లో  పార్లమెంట్  ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్టం  భారత రాజకీయ చరిత్రలో ఒక మైలురాయి అనుకోవచ్చు. కానీ,  ఆ చట్టం అమలుచేసే పద్ధతి ఏమిటో, పెట్టిన షరతులు, ప్రత్యేకంగా జనగణనతోపాటు  డీలిమిటేషన్  కలిపేస్తే,  ఆ చట్టం అమలు ఏవిధంగా జరుగుతుంది వెల్లడించలేదు.  ఇదే చాణక్యం అంటే... ఇందులో రాజకీయం, అధికార  చదరంగంలో  ఎత్తులు, 
పై ఎత్తులు,  కుట్రలు, ఆటలు, కలిసి ప్రజాస్వామ్యం మీద దాడులు చేస్తున్నట్టుంది. 

  • నాలుగు కీలకమైన అంశాలు

ఒకటో కీలకం.  850 లోక్​సభ స్థానాలు. లోక్‌‌‌‌‌‌‌‌సభ సభ్యుల సంఖ్యను రాష్ట్రాల నుంచి 530,  కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 20 ఉన్న పరిమితిని 35కి పెంచుతూ, మొత్తం 850 స్థానాలకు పెంచుతున్నారు. రెండో కీలకం:  ‘జనాభా’ పదానికి అస్ఫష్టమైన నిర్వచనం.   సీట్ల కేటాయింపు కోసం 1971 జనాభా గణనను, నియోజక వర్గాల సరిహద్దుల నిర్ణయం కోసం 2001 జనాభా గణనను ప్రాతిపదికగా తీసుకునే ప్రస్తుత రాజ్యాంగబద్ధమైన  జనాభా  నిర్వచనాన్ని మార్చి,  పార్లమెంటు చట్టం ద్వారా నిర్ణయించిన విధంగా  అనే  అస్పష్టమైన నిర్వచనం ప్రవేశిస్తుంది.  మూడవ కీలకం.  రాజ్యాంగ సవరణ కాకుండా సాధారణ మెజారిటీ చాలట.  దీనివల్ల ఏ జనాభా గణనను ఉపయోగించాలనేది  ఇకపై  
రాజ్యాంగంపై కాకుండా.. సాధారణ మెజారిటీతో మార్చగలిగే చట్టంపై ఆధారపడి ఉంటుంది. నాలుగోది కీలకమైన తొలగింపు.  అధికరణలు 82, 170లోని మూడవ  నిబంధనను  పూర్తిగా తొలగిస్తుంది. 

1976 నాటి 42వ సవరణ 2001 నాటి 84వ  సవరణ ద్వారా అమలులో ఉన్న సీట్ల కేటాయింపు నిలుపుదల అంటే స్తంభించడం.  జనాభాను నియంత్రించిన రాష్ట్రాలకు పార్లమెంటరీ స్థానాలు తగ్గవనే హామీని ఇచ్చింది. ఇప్పుడు ఆ రక్షణ కవచం మాయమైపోతుంది.  అంటే రాజ్యాంగపరమైన గ్యారంటీని మామూలు సాధారణ మెజారిటీతో ప్రభుత్వం చిన్న చట్టం ద్వారా కీలకమైన స్థానాల సంఖ్య నిర్ణయించే అధికారం కేంద్రానికి లభిస్తుంది. రాజ్యాంగ చట్టాల గ్యారంటీని వదులుకొని, కేవలం హామీని ఏవిధంగా నమ్మడం?.  మంత్రులు సీట్ల నిష్పత్తిని అన్ని రాష్ట్రాలకు సమానంగా పెంచుతామని హామీ ఇచ్చారు. 

కానీ ఈ హామీ రాజ్యాంగ సవరణలో ఎక్కడా కనిపించడం లేదు. ఆర్టికల్ 81(2)(ఎ) ప్రకారం సీట్లకు,  జనాభాకు మధ్య ఉన్న నిష్పత్తి అన్ని రాష్ట్రాలకు ‘సాధ్యమైనంత వరకు’ సమానంగా ఉండాలని నిర్దేశిస్తుంది.  ఇది  జనాభా ప్రాతిపదికన కేటాయింపును  సూచిస్తుందే తప్ప,  ప్రస్తుత  నిష్పత్తిని రక్షించగలుగుతుందా?  ఢిల్లీ సుల్తాన్​లు రాజకీయ చక్రం తిప్పుతూ ఉంటారు.   ప్రస్తుతం లోక్‌‌‌‌‌‌‌‌సభలో 543 స్థానాలు ఉన్నాయి.  ప్రతిపాదిత సవరణల ప్రకారం వాటిని 850కి పెంచడం ఒక సాధారణ పరిపాలనా నిర్ణయం కాదు,  ఇది రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే లోతైన ఎత్తుగడ.

  • ఎంపీల సీట్లు పెంచడంలో సమస్యలు

స్థానాల పెంపు జనాభా ఆధారంగా ఉంటుంది.  అంటే,  అధిక జనాభాగల రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు,  తక్కువ  జనాభా గల రాష్ట్రాలకు తక్కువ ప్రాతినిధ్యం. ఈ మార్పు భారత రాజ్యాంగంలోని ఆర్టికిల్ 81 కాస్త సవరించుకుంటున్నామంతే అంటారు.  కానీ, అసలు రాజ్యాంగ స్ఫూర్తిని,  ప్రజాస్వామ్యాన్ని తిరిగి  పునర్నిర్వచించే  ఆలోచన కనిపిస్తున్నది.  మహిళలకు  రిజర్వేషన్  రాజ్యాంగ 106వ  సవరణ తర్వాత ప్రతిపక్షాలు సూచించినట్లుగా,  ప్రస్తుతం ఉన్న 543 స్థానాల్లోనే  నియోజకవర్గాలను రొటేషన్ పద్ధతిలో కేటాయించడం ద్వారా మహిళా రిజర్వేషన్లను అమలు చేయవచ్చు.  లోక్‌‌‌‌‌‌‌‌సభలో  ప్రాతినిధ్యాన్ని  కోల్పోయే రాష్ట్రాలకు చెందిన ఎంపీలు, భారత  సమాఖ్య  పునాదులను  దెబ్బతీసేలా బలవంతంగా రుద్దుతున్న ఈ చట్టాన్ని  ప్రతిఘటించాల్సిందే. ఈ సవరణ గనుక ఆమోదం పొందితే వచ్చే పరిణామాలు  ఊహకందవు.  

 

  • రాజకీయ ముసుగు  ఏదైనా ఉందా? 

లోక్‌‌‌‌‌‌‌‌సభ సీట్ల భారీ పునర్విభజన కోసం మహిళా రిజర్వేషన్లను ఒక రాజకీయ ముసుగుగా వాడుతున్నట్లు కనిపిస్తోంది.  ఈ పునర్విభజన వల్ల బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరి, అది చారిత్రక బలహీనంగా ఉన్న రాష్ట్రాలకు  నష్టం కలిగించేలా పార్లమెంటు  సమాఖ్య నిర్మాణాన్ని మార్చే అవకాశం ఉంది.   ఒకటో సాకు.. మన దేశ పదేళ్ల వార్షిక జనాభా గణనను నిష్కారణంగా ఐదేళ్లకు పైగా ఆలస్యం చేయడం ఎందుకు?  దీనివెనక ఉన్న రాజకీయ తర్కం అర్థం అవుతోందా? రెండో సాకు...   కొవిడ్- కారణంగా  2021 జనాభా గణనను వాయిదా వేశారు.  కానీ  ఆ తర్వాత  జరిగిన వరుస వాయిదాలకు ఎటువంటి కారణం చెప్పలేదు.  మూడో అంశం.. చివరకు ఈ జనాభా గణన ప్రక్రియ 2026-–27లో జరుగుతుందని నిశ్శబ్దంగా ప్రకటించారు.  

రాజ్యాంగం ప్రకారం.. 1971 జనాభా గణన ఆధారంగా లోక్‌‌‌‌‌‌‌‌సభ స్థానాల పంపిణీపై ఉన్న 'స్టే' (నిలుపుదల), 2026 సంవత్సరం తర్వాత జరిగే మొదటి జనాభా గణన ప్రచురించిన తర్వాతే ముగుస్తుంది.   నిజానికి సాధారణ క్రమంలో  అయితే 2031 జనాభా గణన ఆధారంగా పునర్విభజన జరగాలి.  కానీ,  జనాభా గణనను 2026-–27కు మార్చడం ద్వారా  కేంద్రప్రభుత్వం తనకు అనుకూలమైన సమయంలో  ఈ ప్రక్రియ  ప్రారంభించింది.  అంటే 2031 వరకు  ఆగకుండానే పునర్విభజన ప్రక్రియ ఎందుకు మొదలుపెట్టారు?  ఇదేం మిస్టరీ!.

  • బిల్లుల  ముసాయిదాలో  వివరణలు లేవు

‘మహిళా రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌కు మేమంతా మద్దతు ఇస్తున్నాం. కానీ ప్రభుత్వం దానిని రాజకీయ ప్రయోజనాల కోసం  వాడుతోంది’ అని  కాంగ్రెస్​ అధ్యక్షుడు  మల్లికార్జున్  ఖర్గే  అన్నారు.  అంటే, ఒక సామాజిక  రాజ్యాంగ,  న్యాయ అంశాలను,  రాజకీయ లాభనష్టాల  కూడివేతలు, కూటములు, దుష్టకూటములు అని లెక్క పెట్టుకునే  కొత్త  అర్థంకాని  గణితంగా మార్చే ప్రమాదం కనిపిస్తున్నది.   మహిళల  రిజర్వేషన్లకు, పునర్విభజనకు భయానకమైన ముడి.  సమస్య  ఏమిటంటే బిల్లుల  ముసాయిదాలో  వివరణలు లేవు.  అవి పార్లమెంటుకు ఇచ్చేముందు  మూడు రోజుల వ్యవధి మాత్రమే ఇవ్వడం చాలా అన్యాయమనీ,  ఈలోగా చట్టాలు అందరూ ఆమోదం సాధించిన తరువాత, హామీలు  మాత్రమే మిగులుతాయి, కాని గ్యారంటీలు ఏమీ ఉండవనే భయం వస్తున్నది.   

మహిళా సాధికారత చాలా మంచి లక్షణమే.  కేంద్రం ప్రకటించిన  ఈ  బిల్లుల ద్వారా ఒక విస్తృతమైన శాసన ప్యాకేజీలో కీలకమైన భాగం అవుతుంది.  రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, 2026,  దానితో కూడిన  నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లు.  ఒకటికి మరొకటి అనుబంధం గురించి చర్చించుకోవలసి ఉంది.  2023లో  ఆమోదించిన 'నారీ శక్తి వందన్ అధినియమ్' రాజ్యాంగ (106వ సవరణ) ప్రకారం లోక్‌‌‌‌‌‌‌‌సభ, అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుంది.  అయితే ఇది జనాభా గణన తర్వాత జరిగే నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపడి ఉంది.  మహిళా రిజర్వేషన్లను పునర్విభజనతో కలపాలని ప్రభుత్వం పట్టుబట్టడం ఎందుకు?  

ఎందుకీ తొందర? 

2026-27  జనాభా గణన తర్వాత పునర్విభజన  పూర్తి కావడానికి సంవత్సరాలు  పడుతుందని,  తద్వారా 2029 లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికలకు అది సిద్ధంగా ఉండదని గ్రహించిన ప్రభుత్వం, ఇప్పుడు 2011 జనాభా గణన ఆధారంగా పునర్విభజనను  త్వరితగతిన  పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నారు.  అసలు సమస్య ఏమంటే ‘తొందర’, హడావిడి, చర్చకు  సిద్ధంగా లేకపోవడం. రెండు కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగడానికి కొద్దిరోజుల ముందు, బహిరంగ చర్చకు  అవకాశం లేకుండా ఈ చట్టాన్ని హడావుడిగా తీసుకురావడం చూస్తుంటే  బోలెడన్ని 
అనుమానాలు వస్తున్నాయి. ఈ అనుమానాలకు ఎవరు జవాబిస్తారు?  టోకున బోలెడు సవరణలు అవసరమా? 131వ  సవరణ బిల్లు  రాజ్యాంగంలోని అధికరణలు 55, 81, 82, 170, 330, 332, అదేవిధంగా 334Aలను సవరణ చేయడానికి చర్యలు శరవేగంగా చేశారు. 

- మాడభూషి శ్రీధర్
మాజీ కేంద్ర సమాచార కమిషనర్​

Note: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com 

రచయితల ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.